బధాయూ: ఉత్తరప్రదేశ్‌లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సదరు మహిళ సంఘటన జరిగిన సాయంకాలం బయటకు రాకుండా ఉండిఉంటే ఈ ఘటన జరిగేది కాదని కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవి వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసుల స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘ప్రతిసారీ నేను స్త్రీలకు ఒకటే చెబుతున్నా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనవసర సమయాల్లో బయటకు వెళ్లకండి’’అని బాధిత మహిళా కుటుంబంతో సమావేశానంతరం చెప్పారు. బాధిత మహిళ ఆ సాయంత్రం బయటకు పోకుండా ఉన్నా, లేదా కుటుంబంలో ఒక చిన్నారిని తోడుగా తీసుకువెళ్లినా ఈ సంఘటన జరిగేది కాదన్నారు. అత్యాచార సంఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్ బట్టి తెలుస్తోందన్నారు.
ఆదివారం 50 ఏళ్ల అంగన్‌వాడీ వర్కర్ దగ్గరలో గుడికి వెళ్లి అత్యాచారానికి, హత్యకు గురైంది. ఇది గుడిపూజారి, అతని సహాయకులు చేసిన పనేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి పూజారి పరారీలో ఉన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే కనీసం బాధితురాలు ప్రాణాలతో ఉండేదని దేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి విషయాలపై సీరియస్‌గా ఉన్నా, ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. పోలీసులు తమ పేలవ స్పందన కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేశారని దేవి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, పోలీసులు కావాలనే పోస్టుమార్టం ఆలస్యం చేశారని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ ఆరోపించారు. యోగి పాలనలో స్త్రీలపై అత్యాచారాలు ఎన్నడూ లేనంతగా పెరిగాయని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment