
మాస్క్ పెట్టుకోని మహిళను చితకబాదుతున్న పోలీసులు(ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
భోపాల్: మాస్క్ ధరించని మహిళపై మధ్యప్రదేశ్ పోలీసులు దారుణంగా దాడి చేశారు. పురుష అధికారితో పాటు ఓ లేడీ పోలీసు ఆఫీసర్ సదరు మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్టుపట్టుకుని లాగి.. చితకబాదారు. వారి చేతుల నుంచి బయటపడటానికి సదరు మహిళ శాయశక్తుల ప్రయత్తించినప్పటికి వీలు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ధరించకపోవడం మహిళ తప్పే.. కానీ పోలీసులు ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు.
ఆ వివరాలు.. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు తేవడానికి రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించలేదు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు సదరు మహిళపై దాడి చేశారు. మహిళా పోలీసు అధికారి మహిళను పట్టుకుని ఉండగా.. పురుష అధికారి మాత్రం ఆమె చేయి పట్టి లాగి.. కాళ్లతో తంతూ.. సదరు మహిళపై పిడిగుద్దులు కురిపించాడు.
మహిళా అధికారి ఆమెను పోలీస్ వ్యాన్‌లో ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె కూతురు తల్లిని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. అధికారులు ఏ మాత్రం కనికరించకుండా ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లి వ్యాన్‌లో ఎక్కించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఓ మహిళ అధికారి ఆమె చంప పగలకొడుతుంది.
రోడ్డు మీద వెళ్తున్నవాళ్లు ఈ అరచకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనుల ‘‘నేరస్తులను కూడా ఇంత దారుణంగా కొట్టరు కదా.. మాస్క్ ధరించనందుకు.. పెద్దావిడ అని కూడా చూడకుండా ఇంత దారుణంగా దాడి చేస్తారా.. మీరు మనుషులా రాక్షసులా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment