తేల్చిచెప్పిన కేరళ హైకోర్టు
కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్యాఖ్యలు చేసినా, ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపినా లైంగిక వేధింపుల సెక్షన్ల కింద అవి నేరంగా పరిగణించబడతాయని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కార్యాలయంలో పనిచేసిన కాలంలో తోటి మహిళా ఉద్యోగిపై తాను చేసిన వ్యాఖ్యల కుగాను నమోదైన లైంగిక వేధింపుల కేసులను కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్ మాజీ ఉద్యోగి చేసిన అభ్యర్థనను జస్టిస్ ఏ.బధారుద్దీన్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది.
ఎర్నాకులం జిల్లాలో కేఎస్‌ఈబీ ఆఫీస్‌లో పనిచేసిన కాలంలో 2013 ఏడాది నుంచి తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, 2016–17 కాలంలో మొబైల్ ఫోన్‌కు తన రూపురేఖలను వర్ణిస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపారని, వాయిస్ కాల్స్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ఆ తర్వాత సైతం అతని నుంచి ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీంతో భారత శిక్షాస్మృతిలోని 354(ఏ)(1)(4), 509 సెక్షన్లతోపాటు కేరళ పోలీస్ చట్టంలోని 120(ఓ) సెక్షన్ కింద సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదైంది. అందంగా ఉందని మాత్రమే ఎస్‌ఎంఎస్‌లు పంపానని, ఆ సందేశాల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేదని అతని తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల సెక్షన్లను తొలగించాలంటూ ఆ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment