ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సతీమణి సంభోగానికి ఒప్పుకోకపోయినా సర్దుకుపోతామని 66 శాతం మంది పురుషులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల మహిళలు తమ భర్తలతో కలయికకు అభ్యంతరం చెబుతున్నారు. భర్తకు సుఖవ్యాధులు, వేరే మహిళతో వివాహేతర సంబంధం, ఆలసట లేదా కోరిక లేకపోవడం వంటి కారణాలతో 80 శాతం స్త్రీలు శృంగారానికి నో చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది.
...అయినా ఇబ్బంది పెట్టం
మహిళా సాధికారతపై అధ్యాయంలోని 'భర్తతో సురక్షితమైన లైంగిక సంబంధాలను చర్చించే వైఖరులు' అనే విభాగంలోని ఈ ప్రశ్న.. లింగ సమానత్వంలో కీలకమైన ‘అంగీకార’ అంశంగా సర్వేలో నిలిచింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న వారికి ఈ పశ్నను సంధించగా ఐదుగురిలో నలుగురు మహిళలు, పురుషులు పై కారణాలతో ఏకీభవించారు. తమకు ఇష్టం లేకపోతే ఏకాంతానికి ఒప్పుకోబోమని చెప్పిన మహిళల సంఖ్య గత సర్వేతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అలాగే భార్యలను ఇబ్బంది పెట్టబోమని చెప్పిన భర్తల సంఖ్య 3 శాతం పెరిగింది.
దండిస్తాం.. కుదరదు
తాను కోరుకున్న సమయంలో శృంగానికి ఒప్పుకోకపోతే భార్యను దండించే హక్కు ఉందని 19 శాతం పురుషులు అభిప్రాయపడటం గమనార్హం. భర్తలకు తమను దండించే హక్కు లేదని ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు అంటే 82 శాతం మంది కుండబద్దలు కొట్టారు. (క్లిక్: వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్‌లో బంధువులు)
అప్పుడు కొట్టడం కరెక్టే
భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లం, పిల్లల్ని లేదా ఇంటిని పట్టించుకోకపోవడం, వాదనకు దిగడం, భర్తతో కలయికకు ఒప్పుకోకపోవడం, వంట సరిగా చేయకపోవడం, భర్త పట్ల నమ్మకంగా ఉండకపోవడం, అత్తమామల పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించకపోవడం వంటి సందర్భాల్లో భార్యలపై తాము చేయిచేసుకుంటామని 44 శాతం మంది పురుషులు వెల్లడించారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇదే రకమైన అభిప్రాయాన్ని పురుషులు కంటే మహిళలే ఎక్కువగా (45 శాతం) వ్యక్తం చేశారు. అయితే గత సర్వేతో పోల్చుకుంటే(52 శాతం) ఈ సంఖ్య 7 శాతం తగ్గడం ఊరటనిచ్చే అంశం. భార్యలను అదుపులో పెట్టుకోవడానికి కొడతామని చెప్పిన పురుషుల సంఖ్య గతంతో (42 శాతం) పోలిస్తే రెండు శాతం పెరగడం గమనార్హం.
సర్వే ఇలా..
2019-21 మధ్య కాలంలో రెండు దశల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 జూన్ 17 నుంచి 2020 జనవరి 30 వరకు మొదటి దశ సర్వే చేశారు. 2020 జనవరి 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు నిర్వహించిన రెండో దశ సర్వే 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగింది. (చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment