
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు తొలి అడుగుపడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన తొలిరేజే (సోమవారం) మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. . నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు..కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు కావడం విశేషం.
బుధవారం రోజు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది, ఏడు గంటలపాటు లోక్‌సభ సభ్యులు చర్చించనున్నారు. సెప్టెంబర్ 21న రాజ్యసభకు బిల్లు వెళ్లనుంది.విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చినఈ బిల్లు ఆమోదానికి ఉభయసభల సభ్యులు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. అయితే ఈ బిల్లుకు విపక్ష పార్టీలు కూడా మద్దతివ్వడంతో త్వరలోనే చట్టరూపం దాల్చే సూచనలు కనిపిస్తాన్నాయి. బిల్లు పాసైతే పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లులో కీలక అంశాలు
మహిళా బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొంది చట్టంగా మారితే.. లోక్‌సభ, అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీకీ ఇది వర్తిస్తుంది.ఈ కోటాలోనే మూడో వంతు సీట్లు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కేటాయించారు. అయితే ఈ బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్ లేదు. ఎందుకంటే చట్టసభలకు అలాంటి నిబంధన లేదు. అందుకే దశాబ్ధాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును సమాజ్‌వాదీపార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతోపాటు ఈ బిల్లు రాజ్యసభ, శాసనమండలికి వర్తించదు.
► అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2029 నాటికి అమల్లోకి రానుంది. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానుంది. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే ముందుగా జనగణన జరగాలి. జనాభా జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.
► తాజా జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తరువాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది.. అంటే 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది. వీలైతే దీనిని పొడిగించే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన ప్రతిసారీ రొటేషన్ ప్రక్రియలో మహిళా రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది.
► ఈ బిల్లు 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లును పోలి ఉంటుంది. కానీ అప్పుడు ఆ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో ఆ లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు కథ ముగిసిపోయింది. ఈ కొత్త బిల్లులో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని తొలగిస్తూ రెండు సవరణలు మాత్రమే చేశారు. అయితే ఈ కొత్త బిల్లు 2010 నాటిది కాదని.. మహిళా రిజర్వేషన్ల కోసం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment