ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు రావాలంటే క్రిస్మస్ వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్‌సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్‌లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్‌కు చాలా సమయం పట్టవచ్చని అన్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి బాధిత కార్మికులను బయటకు తీసుకురాగలుగుతామని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గుతుంది.
అంతర్జాతీయ నిపుణుడు డిక్స్.. ఆగర్ యంత్రం పగిలిపోయిందని చెప్పడంతో సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించిన అనంతరం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం
Comments
Please login to add a commentAdd a comment