ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ వినతి
చండీగఢ్: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించారు. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద పంజాబ్ రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనోద్యమం శనివారం 200వ రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్‌తోపాటు ఖనౌరీ బోర్డర్ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలాల వద్ద బైఠాయించి వారికి వినేశ్ ఫొగాట్ మద్దతు పలికారు.
రైతు కుటుంబంలో పుట్టిన వినేశ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. డిమాండ్లు ఇంకా నెరవేర్చనందుకే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 200 రోజులుగా ఉద్యమిస్తున్న వీళ్లను చూస్తే బాధేస్తోంది. రెజ్లర్లుగా మేం రైతులకు మావంతుగా ఏమీ చేయలేకపోయామని ఒక్కోసారి అనిపిస్తుంది.
అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మేము ఇక్కడ సొంత కుటుంబం కోసం ఏమీ చేయలేక నిస్సహాయులమయ్యాం. వీళ్ల బాధను ఇప్పటికైనా ప్రభుత్వం వినాలి. రైతన్న అన్నం పెట్టకపోతే మనమెలా బతుకుతాం?. ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోయినా నిస్వార్థంగా రైతులు పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్లది పెద్ద మనసు. ప్రభుత్వం కూడా తమది పెద్దమనసు అని చాటిచెప్పాలి.
డిమాండ్లను నెరవేర్చాలి. హరియాణాలో రైతులు ఉద్యమిస్తే వారికీ నేను మద్దతు పలుకుతా. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిందే. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతుల ఉద్యమం వృథా కాకూడదు’’ అని అన్నారు. హరియాణాలోని ఛర్ఖీ దాద్రీ జిల్లాకు చెందిన మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా ‘‘ నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు.
నాకు రాజకీయ అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రాబోను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది రైతుల ఉద్యమస్థలి. ఇక్కడ రైతన్నల సమస్యల గురించే మాట్లాడదాం. చర్చిద్దాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనోద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంయుక్తంగా అక్కడే ‘కిసాన్ మహాపంచాయత్’ ఏర్పాటుచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment