Top Wrestlers At Sports Minister's House Hours After Invite For Talks - Sakshi
Sakshi News home page

రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి..

Published Wed, Jun 7 2023 12:55 PM | Last Updated on Wed, Jun 7 2023 1:09 PM

Wrestlers At Sports Ministers House Hours After Invite For Talks - Sakshi

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్న తెలిసిందే. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించడం లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు కూడా మన్నించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో రెజ్లర్లు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ని అరెస్టు చేయడం, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఎన్నికలు నిర్వహించి కొత్త చీఫ్‌ ఎన్నుకోవాలని డిమాండ్‌ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా తాము ఎవర్నీ రక్షించాలనుకోవడం లేదని రెజ్లర్లకు ఈ సందర్భంగా తెలిపారు.

ఇదిలా ఉండగా గత శనివారం అమిత్‌ షాతో రెజ్లర్ల సమావేశం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ అమిత్‌ షాతో సమావేశం అనంతరం తిరిగి విధుల్లో చేరడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కానీ రెజ్లర్లు మాత్రం న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు ఒలింపిక్స్‌ పతక విజేత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అమిత్‌ షాతో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ..ఆయనతో జరిగిన సమావేశం గురించి మాట్లాడవద్దని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు.

దీనిపై దర్యాప్తు జరుగుతోందని అమిత్‌షా తెలిపారు. ఐతే నిరసన ఉద్యమం మాత్రం ఆగిపోలేదని, అది కొనసాగడమే గాక ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై వ్యూహ రచన చేస్తున్నామని పునియా చెప్పారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో తాము సంతృప్తి చెందలేదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు. కాగా, బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. అతడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు.  

(చదవండి: అమిత్‌ షా ఇంటి వద్ద మణిపూర్‌ మహిళలు నిరసన)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement