
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన
భువనేశ్వర్: పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని పలు సమస్యలపై శాసనసభ ముట్టడికి ప్రయత్నించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, అసలైన నిందితుల గుర్తింపు, ఇదే ఘటనలోని ప్రధాన సూత్రధారి మంత్రి దివ్యశంకర మిశ్రా మంత్రి మండలి బహిష్కరణ వంటి డిమాండ్లతో అసెంబ్లీ వైపు దూసుకుపోతున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో మాస్టర్ క్యాంటీన్ ఛక్ ప్రాంతంలో ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలపై ఖాకీలు విరుచుకుపడ్డారు.
దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో పలువురికి తీవ్రగాయాలు కాగా, మరికొంతమంది తలలు పగిలాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం, పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా సర్కారు చర్యలు ఉన్నాయని విమర్శించాయి. నగరంలోని కాంగ్రెస్ భవన్ నుంచి మాస్టర్ క్యాంటీన్ ఛక్, లోయర్ పీఎమ్‌జీ మీదుగా శాసనసభ ముట్టడించేందుకు వెళ్తుండగా, ఈ దాడి చోటుచేసుకుంది. ఇదే తరహాలో గురువారం బీజేపీ యువ మోర్చా చేపట్టిన ఆందోళనను సైతం పోలీసులు లాఠీచార్జ్‌తో అడ్డుకోవడం గమనార్హం.
సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్..
యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, పోలీసుల జులం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పోలీస్ యంత్రాంగాన్ని చట్టాలకు విరుద్ధంగా వినియోగించుకుంటోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు.
కాంగ్రెస్ భవన్‌లోకి చొరబడి మరీ పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషంగా కాంగ్రెస్ చీఫ్ విప్ తారాప్రసాద్ బాహిణీపతి పేర్కొన్నారు. దీనిని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇకనైనా నవీన్ సర్కారు ఈ చర్యలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.