YSRCP MP Midhun Reddy Comments in Lok Sabha About Special Status - Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ‘హోదా’ గళం

Published Tue, Dec 13 2022 4:42 PM | Last Updated on Wed, Dec 14 2022 8:12 AM

YSRCP MP Mithun Reddy Comments in Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీ మేరకు ఆంధ్ర్ర­పదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాలని, జీవనాడి లాంటి పోలవరానికి నిధులివ్వకుండా, జా­తీయ ప్రాజెక్టులా భావించకుండా కేంద్రం తా­త్సా­­రం చేస్తోం­దని వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్ల­మెంట్‌లో గట్టిగా గళమెత్తారు. అశాస్త్రీయ విభజ­నతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఎనిమిదేళ్లు గడిచినా నెరవేర్చకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో 20 మందికిపైగా ఎంపీలంతా కలసి హోదా ఇవ్వాలని వందల సార్లు డిమాండ్‌ చేశామని, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని గుర్తించాలన్నారు.

కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను గత సర్కారుకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలేవీ పూర్తి కాలేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. 2014లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సౌగతారాయ్‌ సభకు గుర్తు చేశారు. మంగళవారం లోక్‌సభలో ‘సప్లిమెంటరీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌’పై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఆ వివరాలివీ..

ఏపీకి ప్రత్యేక హోదా అనేది దేశ ప్రజల గళం కావాలి. హోదా కల్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు నివేదించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతోప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సాకులు చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టాం. విభజన చట్టానికి సవరణ చేయాలని కోరాం. రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో డిమాండు చేశారు. జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ టీడీపీ సభ్యుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 

రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరానికి జాతీయ ప్రాజెక్టు తరహాలో నిధులు విడుదల చేయడం లేదు. నూతన భూసేకరణ నిబంధనలు, ప్రాజెక్టు ఖర్చు పెంపు ఇలా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సాంకేతిక కమి­టీ 2019లోనే ఆమోదించినా ఆర్థిక శాఖ ఇంకా ఆమో­దించకపోవడం సరికాదు. ఆశ్చర్యకరమైన అంశం ఏమి­టంటే తాగునీటి కాంపొనెంట్‌ను వేరు చేయడం. అంచనా వ్యయం నుంచి రూ.4,068 కోట్లు వేరు చేసి కేవలం సాగు­నీటి కోసమే ప్రాజెక్టును కడుతున్నామనడం ఎంతవరకు సమంజసం? ప్రాజెక్టును తాగునీటికి వినియో­గిస్తే ఆ మొత్తాన్ని తగ్గిస్తామనడం సరికాదు. జాతీయ ప్రాజె­క్టులో తాగునీరు కూడా ఒక భాగమే. కాంపొనెంట్‌ వారీ షర­తులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. పోల­వ­­రానికి రూ.10వేల కోట్ల అడ్‌హక్‌ నిధులను కేటాయించాలి. 

ఉపాధి హామీ నిధులు గతేడాదితో పోలిస్తే రూ.8,600 కోట్లు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌కు 9.68 కోట్ల పనిదినాలు తగ్గాయి. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలి. 
విభజన నేపథ్యంలో సుమారు రూ.32 వేల కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. గత ప్రభుత్వం పరిమితికి మించి రూ.17,923 కోట్లకుపైగా రుణాలు అదనంగా తీసుకుందనే కారణంతో ఇప్పుడు కోతలు విధించడం సరికాదు. రూ.6,800 కోట్ల విద్యుత్తు బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత చట్టం ప్రకారం 77 వేల అదనపు టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రానికి అందచేయాలి. 
ఏపీ ప్రభుత్వం హోదా కోరింది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అయితే 14వ ఆర్థిక సంఘం సాధారణ రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామన్నారు. రాష్ట్రాల వనరుల లోటును రెవెన్యూ లోటు నిధులతో పూడుస్తున్నామని చెప్పారు.

చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement