తీగలాగితే డొంక కదలింది..! | - | Sakshi
Sakshi News home page

తీగలాగితే డొంక కదలింది..!

Published Tue, Feb 11 2025 12:42 AM | Last Updated on Tue, Feb 11 2025 12:42 AM

తీగలాగితే డొంక కదలింది..!

తీగలాగితే డొంక కదలింది..!

ఓ ప్రమాదం పీడీఎస్‌ బియ్యం దందా గుట్టు రట్టు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా, రైస్‌మిల్‌కు ఉన్న లింకు బయటపడింది. దీంతో సదరు మిల్లుపై దాడిచేయగా, అప్పటికే మిల్లు నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు లారీల ధాన్యం గుర్తించారు. ఒక్క ప్రమాదంతో ఇటు పీడీఎస్‌ దందా, మరోవైపు వడ్ల అక్రమ రవాణా డొంక కదిలింది.
● పీడీఎస్‌ రైస్‌ దందా గుట్టు రట్టు చేసిన ప్రమాదం ● ధర్మాబాద్‌లో స్థావరంపై జిల్లా పోలీసుల దాడి.. ● లక్ష్మణచాంద రైస్‌మిల్‌కు తరలిస్తున్నట్లు గుర్తింపు ● వడ్లు తరలిస్తున్న రెండు మిల్లులపై కేసు ● భైంసాలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిల

భైంసాటౌన్‌: ధర్మాబాద్‌ నుంచి తరలిస్తూ భైంసాలో పట్టుబడిన పీడీఎస్‌ బియ్యం ఘటనలో ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు.. అటు పీడీఎస్‌ రాకెట్‌తోపాటు ఇటు రైస్‌మిల్లుకు ఉన్న లింక్‌ బయటపడింది. కేసు విచారణలో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ధర్మాబాద్‌కు చెందిన ఒకరు జిల్లాలో ఏజెంట్ల నుంచి బియ్యం సేకరించి, తిరిగి జిల్లాకే సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో లారీలో బియ్యం తరలిస్తూ పట్టుబడడంతో దందాపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఆదేశాలతో భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనాతో కలిసి ధర్మాబాద్‌లోని స్థావరంపై దాడి చేయగా, పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

పీడీఎస్‌ బియ్యం రైస్‌మిల్లుకు..

పీడీఎస్‌ బియ్యం పట్టుబడిన ఘటనలో ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి రాకెట్‌ ఛేదించారు. అంతేగాక, టాస్క్‌ఫోర్స్‌ రాష్ట్ర అధికారులు సైతం రెండురోజులుగా జిల్లాలోనే తనిఖీలు చేపడుతున్నారు. లక్ష్మణచాందలో రెండు రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కేంద్రంగా సాగుతున్న పీడీఎస్‌ బియ్యం దందా గుట్టురట్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల తెలిపారు. భైంసా పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. ధర్మాబాద్‌కు చెందిన రవూఫ్‌ అనే వ్యక్తి ఈనెల 8న ధర్మాబాద్‌ నుంచి లక్ష్మణచాందలోని ఓ రైస్‌మిల్‌కు 36 టన్నుల పీడీఎస్‌ బియ్యం లోడ్‌తో లారీ పంపించాడు. లారీ భైంసా పట్టణంలోకి చేరుకోగానే, నిర్మల్‌ చౌరస్తా వద్ద ఓ కారును ఢీకొంది. ఈ ఘటనతో సదరు లారీలో పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌ ప్రత్యేకంగా దర్యాప్తు జరిపారు. ఇందులో భాగంగా నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్‌ పోలీసుల సహకారంతో ధర్మాబాద్‌లో పీడీఎస్‌ రైస్‌ రాకెట్‌ స్థావరంపై దాడి చేశారు. జిల్లా నుంచి ధర్మాబాద్‌లోని సదరు స్థావరానికి తరలిస్తున్న మరో 6 టన్నుల బియ్యం బిద్రెల్లి వద్ద పట్టుకున్నారు. లక్ష్మణచాందలోని రైస్‌మిల్లులో తనిఖీ చేయగా, అప్పటికే అక్కడ రెండు ట్రక్కుల్లో ధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి, సివిల్‌ సప్లయ్‌ అధికారులకు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని, కీలక నిందితుడు రవూఫ్‌ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. జిల్లాలో పీడీఎస్‌ బియ్యం దందా ఓ నెట్‌వర్క్‌లా పనిచేస్తోందని, జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి రవూఫ్‌ లాంటివారు వాటిని రైస్‌మిల్లులకు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. రైస్‌మిల్లర్లు, ఏజెంట్లు, ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీలు అవినాష్‌కుమార్‌, రాజేశ్‌మీనా ఉన్నారు. కేసు విచారణలో చురుగ్గా పనిచేసిన ముధోల్‌ సీఐతోపాటు ఎస్సైలు అశోక్‌, గణేశ్‌, శ్రీనివాస్‌, కానిస్టేబుళ్లు భీమేశ్‌, గగన్‌, విపుల్‌, తాహెర్‌, రాము, మురళి, శివ, అబుబాకర్‌, అంబాదాస్‌, అలీంను ఎస్పీ అభినందించారు.

పీడీఎస్‌ వ్యాపారుల్లో భయం..

మిల్లర్లపై కేసు నమోదు చేయడంతో కొందరు రైస్‌మిల్లర్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు పోలీసులు పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణపై దృష్టి పెట్టడం, మరోవైపు మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు రేషన్‌ షాపుల ద్వారా బియ్యం అందిస్తోంది. అయితే, చాలామంది వీటిని తినలేక అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం దందా నిర్వహకులు ఏజెంట్లతో గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరించి, మహారాష్ట్రకు తరలించి విక్రయించేవారు. ఇలా సేకరించిన బియ్యంను పెద్దమొత్తంలో పోగుచేసి, వాటిని సన్నబియ్యంగా మార్చి ప్రత్యేకసంచుల్లో ప్యాక్‌ చేసి జిల్లాకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని కొన్ని రైస్‌మిల్లులకు సైతం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement