
ఎమ్మెల్సీ ఎన్నికల లొల్లి!
● జిల్లాలో జోరందుకున్న ప్రచారం ● బీజేపీ అభ్యర్థులతో ప్రారంభం ● వేగం పెంచుతున్న హస్తం పార్టీ ● ‘సోషల్’గా వెళ్తున్న స్వతంత్రులు
నిర్మల్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన మరుసటి రోజు నుంచే జిల్లాలో ప్రచారపర్వం జోరందుకుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇక క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు. జిల్లాలో బీజేపీ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య సోమవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి పట్టభద్రుల అభ్యర్థిగా నామినేషన్ వేసిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్‌రెడ్డి గత కొన్నినెలలుగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి బీఎస్పీ నుంచి నామినేషన్ వేసిన పులి ప్రసన్న హరికృష్ణ, స్వతంత్రులుగా బరిలో దిగిన నంగె శ్రీనివాస్ తదితరులు ప్రధానంగా వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సోషల్‌మీ డియా ద్వారా జిల్లాలోని పట్టభద్రులు, ఉపా ధ్యాయులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ముందుగా ‘కమలం’ ప్రచారం
నామినేషన్లు వేసిన మరుసటి రోజైన సోమవారం నుంచి జిల్లాలో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఆ పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ అభ్యర్థి మల్క కొమురయ్య ప్రచారం ప్రారంభించారు. జిల్లాలో నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వారే ఉండటంతో పాటు అభ్యర్థులిద్దరూ ఈ ప్రాంతానికి కొత్తవారు కావడంతో ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. జిల్లాకేంద్రంలోని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వేర్వేరుగా పట్టభద్రులు, ఉపాధ్యాయులతో వారు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి మద్దతు కోరారు.
ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికతో కాంగ్రెస్..
నామినేషన్ల ఘట్టం చివరిదశ వరకూ తమ పార్టీ నుంచి పట్టభద్రుల అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందునుంచీ సిద్ధంగా లేవు. చివరలో వుట్కూరి నరేందర్‌రెడ్డి నామినేషన్ వేయడంతో జిల్లా ప్రచారానికి సిద్ధమైంది. నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నుంచీ భారీగా నాయకులు తరలివెళ్లారు. ఇక జిల్లాలో తమ ప్రచారం ఎలా ఉండాలి.. ఎలా పట్టభద్రులను ఆకట్టుకోవాలనే ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
స్వతంత్రుల పోరు
బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలుగా ఉండి స్వతంత్రులుగా నామినేషన్ వేసిన వారిలో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వచ్చని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ప్రభావమూ ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎన్నికల్లోనూ చాలామంది పట్టభద్రులు ప్రభావం చూపనున్నారు. ఇప్పటికే జిల్లా జనాల్లోకి వెళ్లిన ప్రసన్నహరికృష్ణ బీఎస్పీ నుంచి నామినేషన్ వేయడం గమనార్హం. ఈయనతో పాటు జిల్లాకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నంగె శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment