
ఎట్టకేలకు షురూ..!
● మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు ● తహసీల్దార్ కార్యాలయాల్లో పేర్ల తొలగింపు ● మార్పులు, చేర్పులకూ అవకాశం
భైంసాటౌన్: రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. పదేళ్లుగా కొత్త రేషన్‌కార్డుల జారీ లేకపోవడం, పాతవాటిలో పేర్ల తొలగింపు, కొత్తగా పిల్లల చేర్పుపై ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు. కొత్తగా పెళ్లయిన జంటలకు రేషన్‌కార్డులు జారీ చేయలేదు. దీంతో ఎంతోమంది రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్ల చేర్పు, కొత్తజంటలు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినా, చాలామందికి కార్డులు జారీ కాలేదు. పేర్ల చేర్పు, తొలగింపులు కూడా జరుగలేదు. ఎట్టకేలకు మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులతోపాటు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దీంతో ఇటు మీసేవ కేంద్రాలు, అటు తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
తహసీల్ కార్యాలయాల్లో తొలగింపు..
మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. కొత్తగా పెళ్లయినవారు తమ తల్లిదండ్రులతో ఉన్న పాత కార్డులో పేర్ల తొలగింపు కోసం తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. తహసీల్దార్ లాగిన్‌లో పేర్ల తొలగింపు చేస్తుండడంతో, ముందుగా పాత రేషన్‌కార్డులో పేర్లు తొలగింపజేసుకుంటున్నారు. అనంతరం మీసేవ కేంద్రాలకు వెళ్లి కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు మీసేవలో దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నా.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల కోసం బారులు తీరుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతమున్న రేషన్‌కార్డులు...
అంత్యోదయ కార్డులు 12,827
తెల్లరేషన్ కార్డులు 1,09,601
మొత్తం కార్డులు 2,08,626
మొత్తం లబ్ధిదారులు 6,41,286
పేర్ల చేర్పునకూ ఆప్షన్..
కొత్త రేషన్‌కార్డుల జారీ, మార్పులు, చేర్పులకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలవడంతో ఎంతోమంది తమ పిల్లల పేర్ల చేర్పు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఒక యూనిట్‌పై ఆరు కిలోల బియ్యం అందిస్తోంది. చాలామందికి పిల్లలు కలిగినా పేర్లు చేర్చకపోవడంతో బియ్యం అందుకోలేకపోయారు. ప్రస్తుతం పేర్ల చేర్పు కోసం ఆప్షన్ ఇవ్వడంతో పిల్లల ఆధార్ వివరాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.
జారీ ఎప్పుడో...!
కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కొత్త కార్డులు ఎప్పుడు జారీ అవుతాయో అన్న అనుమానాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వార్డు సభల్లో, ప్రజాపాలన వేదికల్లో దరఖాస్తులు ఇచ్చినా, ఇటీవల ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టినా చాలామందికి కార్డులు జారీ కాలేదు. ప్రస్తుతం మీసేవలో దరఖాస్తుల స్వీకరణ మొదలైనా.. కార్డులు చేతికి ఎప్పుడొచ్చేనో అని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment