పక్కాగా పంటల గణన | - | Sakshi
Sakshi News home page

పక్కాగా పంటల గణన

Published Fri, Feb 14 2025 10:33 PM | Last Updated on Fri, Feb 14 2025 10:28 PM

పక్కా

పక్కాగా పంటల గణన

నిర్మల్‌చైన్‌గేట్‌: పంటల నమోదులో కచ్చితత్వం

కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేపట్టింది. ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలో ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తోంది. ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఎండలు పెరుగుతుండటం, సర్వర్‌ మొరాయించడం లాంటివి ప్రక్రియకు ఆటంకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లుండగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే కోసం వీటన్నింటినీ ఎంపిక చేశారు. పురుష ఏఈవోలున్న గ్రామాల్లో 2వేల ఎకరాలు, మహిళా ఏఈవోలున్న చోట 1,800 ఎకరాల్లో సర్వే చేయాలని నిర్దేశించారు. ఏటా చేపట్టే సాధారణ పంటల నమోదుతో పాటు డిజిటల్‌ క్రాప్‌ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను వినియోగిస్తున్నారు.

ఫొటో తీసి.. అప్‌లోడ్‌ చేసి..

ఏఈవో నేరుగా పంట చేల దగ్గరికి వెళ్లాలి. ప్రతీ సర్వే నంబర్‌లో సాగు చేసిన పంట ఫొటో తీసి అక్కడినుంచే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎక్కడో ఉండి, ఎవరి పొలమో ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయడం కుదరదు. సర్వే చేసే పొలం నుంచి సర్వే నంబర్‌ 25 మీటర్ల పరిధి వరకే యాప్‌ పనిచేస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీన సర్వే ప్రారంభమైంది. ప్రారంభంలో యాప్‌ సరిగా పనిచేయకపోవడం, సర్వర్‌ బిజీ, నెట్‌వర్క్‌ సమస్యలతో సర్వే మందకొడిగా సాగింది. క్షేత్రస్థాయి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో మూడు, నాలుగు రోజుల నుంచి సర్వే ఊపందుకుంది. జిల్లాలో మొత్తం 1,52,888 ఎకరాలను డిజిటల్‌ సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 28,278 ఎకరాల్లో పూర్తిచేసి యాప్‌లో నమోదు చేశారు.

ప్రతీ సర్వే నంబర్‌కు వెళ్లాల్సిందే..

డిపార్ట్‌మెంట్‌ సమకూర్చిన ట్యాబ్స్‌తో సర్వే చేయడానికి ఏఈవోలు రంగంలోకి దిగారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లలో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. ఈ యాప్‌లోనే క్లస్టర్‌ పరిధిలోని ఏయే సర్వే నంబర్లలో సర్వే చేయాలో వివరాలున్నాయి. అయితే ప్రతీ సర్వే నంబర్‌తోపాటు సబ్‌ సర్వే నంబర్‌ వద్దకు ఏఈవోలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ సర్వే నంబర్‌లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్‌ సమాచారం లేకున్నా అప్‌లోడ్‌ కాదు. ప్రతీ సర్వే నంబర్‌ వద్దకు ఏఈవోలు వెళ్తున్నారు.

జిల్లాలో ముమ్మరంగా ప్రక్రియ

ఏఈవోలకు లక్ష్యం విధింపు

పంట కాలం వరకు గడువు

28,278 ఎకరాల్లో సర్వే పూర్తి

రైతులు సహకరించాలి

జిల్లా వ్యాప్తంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి, పంటల బీమా, పరిహారం పొందడానికి ఉపకరిస్తుంది. సర్వేకోసం వస్తున్న విస్తరణాధికారులకు రైతులు సహకరించాలి.

– అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

సర్వేతో రైతులకు మేలు

డిజిటల్‌ క్రాప్‌ సర్వే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహద పడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికీ ఉపయోగపడుతుంది. వానాకాలంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయించుకోకపోవడంతో పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
పక్కాగా పంటల గణన1
1/1

పక్కాగా పంటల గణన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement