ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
● సమస్యల నిలయం ఽభైంసా ఏఎంసీ ● ఆదాయమున్నా ఫలితం శూన్యం ● ఇతర మార్కెట్లకు రూ.19.24కోట్లు
భైంసాటౌన్: భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద మార్కెట్. భైంసాలోని ఏఎంసీకి ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను స్థానిక మార్కెట్ యార్డులో విక్రయించడం ద్వారా మార్కెట్ కమిటీకి ఆదాయమూ వస్తోంది. అంతేగాకుండా జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లులు, ఏఎంసీ వ్యాపార సముదాయాలు, గోదాంల అద్దెల ద్వారా ఏటా రూ.కోట్లలోనే ఆదాయం సమకూరుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. రైతుల కోసం ఏర్పాటైన ఏఎంసీలో వారి అవసరాలకు అనుగుణంగా నిధులు వెచ్చించలేని దుస్థితి. స్థానిక రైతులు తమ పంటలను విక్రయించడం ద్వారా ఏఎంసీకి చేకూరుతున్న ఆదాయం ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌యార్డులకు తరలిపోతోంది. దీంతో ఇక్కడి ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేకపోతున్నారు. ఫలితంగా పంట విక్రయానికి భైంసా ఏఎంసీకి వచ్చే రైతులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు.
తరలిన రూ.19.24 కోట్లు
భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఏటా రూ.6కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. కాగా, ఇక్కడి ఏఎంసీ నిధులు ఇతర మార్కెట్లకు తరలిపోతుండటం విచారకరం. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.19.24 కోట్లు ఇతర మార్కెట్లకు తరలిపోయాయి. 2014లో సిద్ధిపేట ఏఎంసీకి రూ.8 కోట్లు, 2016లో కుభీర్‌లోని ఏఎంసీకి రూ.1.50 కోట్లు, 2007లో సారంగపూర్ ఏఎంసీకి రూ.75లక్షలు, 2020లో ఖానాపూర్ ఏఎంసీకి రూ.29.42లక్షలు, కుభీర్ ఏఎంసీకి మరోసారి రూ.1.20 కోట్లు తరలిపోగా, రంగారెడ్డి జిల్లాలోని కోహెడ మార్కెట్‌కు రూ.6.50 కోట్లు, జగిత్యాలకు రూ.కోటి నిధులు తరలిపోయాయి.
వసతులు లేక అవస్థలు
భైంసా వ్యవసాయ మార్కెట్ పట్టణ కేంద్రం నడిబొడ్డున ఉంది. దీంతోపాటు ఏఎంసీకి చెందిన గ్రేన్‌యార్డు, మిర్చియార్డు, కాటన్‌యార్డు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అలాగే పట్టణం నడిబొడ్డున ఉండటం, ఈ మార్గంలో రద్దీ ఉండటంతో రైతులు తమ పంట ఉత్పత్తులు విక్రయానికి తెచ్చే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెట్‌ను పట్టణానికి దూరంగా తరలించాలన్న డిమాండ్ వచ్చింది. అలాగే యార్డులో రైతులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ధర లేనప్పుడు పంట ఉత్పత్తులు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ, గోదాంలు లేవు. వానాకాలంలో పంట ఉత్పత్తులు తడిసిపోకుండా ఉండేలా టార్పాలిన్లు అవసరానికి తగినన్నీ లేవు. తాగునీటి వసతి, ఆకలితో వచ్చే రైతులకు తక్కువ ధరకే భోజనం అందిస్తే ప్రయోజనం ఉంటుంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదు. రైతులు సేదదీరేందుకు విశ్రాంతి భవనమున్నా నిర్వహణ, వినియోగం లేక నిరుపయోగమైంది.
ప్రతిపాదనలు పంపించాం
భైంసా ఏఎంసీలో రైతులకు ఇబ్బంది లేకుండా చ ర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల రూ.8.41 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశాం. గో దాముల్లో సీసీ ప్రహరీలు, సీసీ గ్రౌండ్లు, గోదాం, షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. సంబంఽధిత శాఖ మంత్రిని కూడా కలిసి పనులకు నిధులు కేటాయించాలని కోరాం.
– సింధే ఆనంద్‌రావు పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్
రూ.8.41కోట్లతో ప్రతిపాదనలు
భైంసా ఏఎంసీ పరిధిలోని పలుచోట్ల అభివృద్ధి పనులకు రూ.8.41కోట్లతో గతంలోనే తీర్మానం చేయగా, ప్రారంభం కాలేదు. దీంతో ఇటీవల నూతన పాలకవర్గం మరోసారి ప్రతిపాదనలు, తీర్మానం చేసింది. మాటేగాం, తానూరు, కామోల్, ముధోల్ గోదాముల్లో సీసీ ప్రహరీ, పంట ఉత్పత్తులు ఆరబోసేలా మైదానంలో సీసీ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల పంట ఉత్పత్తుల కొనుగోలు కోసం పట్టణంలోని కాటన్‌యార్డులోనే గోదాం నిర్మాణం, ఏఎంసీకి ఆదాయం చేకూరేలా కాటన్‌యార్డు లోనికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్ సంబంధిత శాఖ మంత్రిని కలిసి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment