
వసతులు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో
నిర్మల్‌చైన్‌గేట్: సమగ్ర శిక్ష, పీఎంశ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు. హైదరాబాదు నుంచి కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలకు విడుదలైన నిధులు, చేపట్టిన పనులు, మిగిలి ఉన్న నిధులకు సంబంధించిన వివరాలు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన సమగ్ర శిక్ష, పీఎంశ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పాఠశాలల్లో సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో సివిల్ వర్క్స్, క్రీడా సామగ్రి, విద్యార్థులతో పలు కార్యక్రమాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాలన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ పీఎం సమగ్ర శిక్ష నిధుల ద్వారా ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు క్రీడోపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధులు వినియోగిస్తూ పాఠశాలల్లో ప్రత్యేక దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవో రామారావు, ఏఎస్‌సీ చైర్‌పర్సన్ లింబాద్రి, విద్యాశాఖ అధికారులు రాజేశ్వర్, వెంకటరమణ, శ్రావణి, నర్సయ్య, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అందరికీ ఆధార్ కార్డు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో అందరికీ ఆధార్ కార్డు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ప్రాంతీయ ఆధార్ కార్యాలయ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆధార్ కేంద్రాల్లో సులువుగా ఆధార్ నమోదు, పేరు, చిరునామా తదితర వివరాలు మార్పులు, చేర్పులు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పూర్తిస్థాయి ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులలో ఆధార్ సేవ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో శిశువులు జన్మించిన వెంటనే వారి తల్లిదండ్రుల నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకుని శిశువులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. త్వరలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి, ఆధార్ కార్డులలో తప్పుగా ముద్రించబడిన వివరాలను సరిచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆధార్ కార్డులలో తప్పులు ఉంటే వాటిని సరి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో రామారావు, పోస్ట్ మాస్టర్ వెంకటరావు, డీటీడీవో అంబాజీ, సీడీపీవో నాగలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
Comments
Please login to add a commentAdd a comment