రితేశ్‌కు బీజేపీ పగ్గాలు
● జిల్లా అధ్యక్షుడిగా నియామకం ● వ్యతిరేకత ఉన్నా.. రాథోడ్‌కే మొగ్గు ● పార్టీపై పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు ● తొలిసారి జిల్లాయేతర నేతకు బాధ్యత
నిర్మల్: మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లాలో సీనియర్‌నేత, దివంగత రాథోడ్ రమేశ్ తనయుడు రితేశ్ రాథోడ్‌కు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధికారికంగా ప్రకటించింది. కమలదళాధ్యక్ష ఆశావహుల్లో ఆయన పేరు ఉన్నప్పటికీ.. జిల్లా కానీ నాయకుడికి ఎలా ఇస్తారంటూ సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో చివరి వరకూ రితేశ్‌కు ఇస్తారా.. లేదా అన్న డైలామా కొనసాగింది. కానీ.. జిల్లా నుంచి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలుపడంతోనే పార్టీ అధిష్టానం రాథోడ్ వైపే మొగ్గుచూపినట్లు కమలదళంలో చర్చనడుస్తోంది. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన పలువురు సీనియర్ నేతలు ఈ నియామక ప్రకటనపై అధిష్టానాన్ని కలువనున్నట్లు తెలిసింది.
రాథోడ్ రాజకీయ వారసుడిగా..
ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్, ఎంపీగా చేసిన దివంగత నేత రాథోడ్ రమేశ్ రాజకీయ వారసుడిగా రితేశ్ రాథోడ్ కొనసాగుతున్నారు. తల్లి సుమన్‌బాయి కూడా ఖానాపూర్ ఎమ్మెల్యేగా చేశారు. తండ్రి ఉన్నప్పుడే రితేశ్ యువనేతగా బీజేపీలో కొనసాగారు. రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకుడిగా కొనసాగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కర్ణాటక, మునుగోడు, హుజురాబాద్ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకుని పనిచేశారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ మరణానంతరం ఖానాపూర్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
సీనియర్ల వ్యతిరేకత..
బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి నియామకం ప్రహసనంగా సాగింది. పార్టీలో చాలామంది సీనియర్లు అధ్యక్ష పదవిని ఆశించారు. తామందరినీ కాదని రితేశ్‌కు పదవి ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని కేవలం నాలుగు మండలాలు మాత్రమే జిల్లాలో వస్తాయని, జిల్లాపై పట్టులేని నేతకు బాధ్యతలు ఇవ్వడం సరికాదని వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని గురువారం జిల్లాకు రానున్న సీనియర్ నేత సునీల్‌బన్సల్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రితేశ్ రాథోడ్‌ను నియమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రస్తుత అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి తెలిపారు. 15 నెలలపాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. రితేశ్‌కు అన్నివిధాలా సహకరిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment