
ఆధ్యాత్మిక మార్గం కావాలె..
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆ ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండాలి. జిల్లాలో ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధికి దూరంలోనే ఉన్నాయి. హైదరాబాద్–నర్సాపూర్–బోధన్ మీదుగా బాసర–భైంసా వరకు 161బీబీ హైవే నిర్మిస్తున్నారు. ఇదే హైవేను ఇప్పుడు మహారాష్ట్రలోనే శక్తిపీఠమైన మహోర్ వరకు పొడగించాలని జిల్లావాసులు కోరుతున్నారు. బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు పొడగిస్తే.. ఇటు సరస్వతీ క్షేత్రం నుంచి అటు శక్తిపీఠం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అవుతుందంటున్నారు. ఈ విషయంపై ఇటీవల అసెంబ్లీలోనూ ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. – భైంసా
సరిహద్దులో అవసరం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు ఆనుకుని ఉంది. నిర్మల్ జిల్లాలో ముధోల్ నియోజకవర్గం పూర్తిగా సరిహద్దుకు కలిసి ఉంది. ఈ ప్రాంతంలో మరాఠీ ఎక్కువగా మాట్లాడుతారు. ఇక్కడ ఉండేవారికి మహారాష్ట్రతో బంధుత్వం ఉంది. ఎన్నో ఏళ్లుగా శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు జిల్లా ప్రజలు సరిహద్దు మహారాష్ట్రకు వెళ్తుంటారు. పక్కనే సరిహద్దు ఉన్నా అక్కడికి వెళ్లేందుకు వీలుగా రహదారులు అంతంతగానే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు ఆధ్యాత్మిక కారిడార్‌ను కలుపుతూ హైవే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర, నాందేడ్ జిల్లాలోని మహోర్‌ను కలుపుతూ హైవే నిర్మించాలని కోరుతున్నారు.
అభివృద్ధికీ మార్గం...
బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు హైవే పొడగిస్తే.. సరిహద్దు ప్రాంతంలో అభివృద్ధికీ మార్గం వేసినట్లవుతుంది. ఈ మార్గాల మధ్య పలు పట్టణాలు ఉన్నాయి. భైంసా, కుభీర్, హిమాయత్‌నగర్, కిన్వట్, సాసర్‌కుండ్, ఇస్లాపూర్ పట్టణాలను కలుపుతూ ఈ మార్గం వెళ్లనుంది. హైవే పూర్తయితే వాణిజ్య సంబంధాలూ మెరుగవుతాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు బాసర వరకే వచ్చి ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాస పూజలు జరిపించి తిరిగివెళ్తున్నారు. సరైన రోడ్డులేక మహోర్‌కు వెళ్లలేకపోతున్నారు. నాందేడ్ జిల్లా పరిధిలో చారిత్రక పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరైన మార్గం లేకే బాసర నుంచే వెనుదిరుగుతున్నారు. కేంద్రం ఇప్పటికై నా దృష్టి సారించి రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
భైంసా–బాసర రహదారి
బాసర హైవే మహోర్ దాకా పొడగించాలి..
ఆధ్యాత్మిక కారిడార్‌తో పాటు..
పర్యాటకపరంగా అవకాశాలు
‘మరాఠీ’ సంబంధాలు బలోపేతం
సరిహద్దు ప్రాంతాల్లో హైవే అవసరం
రెండింటి మధ్య సాసర్‌కుండ్ జలపాతం
రెండు క్షేత్రాల వారధిగా...
చదువుల తల్లిగా పూజలందుకుంటున్న సరస్వతీదేవి బాసరలో కొలువుదీరింది. పక్కనే మహారాష్ట్రలోని మహోర్‌లో రేణుకా ఎల్లమ్మగా అమ్మవారు కొలువయ్యారు. అలాగే ఇక్కడ ప్రసిద్ధ దత్తాత్రేయ మందిరం కూడా ఉంది. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహానుబావు ఆచారం పాటించే మరాఠీయులు దత్తాత్రేయ స్వామినే కొలుస్తారు. ఏటా బాసర, మహోర్ పుణ్యక్షేత్రాలకు లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. బాసరలో సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోర్ ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. హైవేను పొడగిస్తే రవాణా ఇబ్బందులు తీరుతాయి. ఇక రెండు క్షేత్రాల మధ్య మహారాష్ట్రలోని సాసర్‌కుండ్‌లో ప్రసిద్ధ జలపాతం ఉంది. ఈ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులంతా జలపాతం వద్ద ఆగి అక్కడి అందాలు వీక్షిస్తుంటారు. మహారాష్ట్ర యాత్రికులు ముందుగా మహోర్‌లో దర్శనాలు చేసుకుని బాసరకు వస్తుంటారు. దసరా నవరాత్రుల్లో బాసర, మహోర్‌లలో ప్రత్యేక ఉత్సవాలు, దర్శనాలు ఉంటాయి. ఈక్రమంలోనే రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీలో ప్రస్తావించా
బాసర నుంచి భైంసా మీదుగా చేపడుతున్న హైవేను మహారాష్ట్రలోని మహోర్ వరకూ పొడగించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని గతంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లా. తాజాగా అసెంబ్లీలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చా. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఇలాంటి రోడ్డుమార్గాలు అవసరం.
– రామారావుపటేల్, ఎమ్మెల్యే, ముధోల్

ఆధ్యాత్మిక మార్గం కావాలె..

ఆధ్యాత్మిక మార్గం కావాలె..

ఆధ్యాత్మిక మార్గం కావాలె..