
సమానత్వం కోసం పోరాడిన జగ్జీవన్‌రామ్
నిర్మల్‌చైన్‌గేట్: సమానత్వం, సామాజిక న్యాయం కోసం భారత మాజీ ఉప్రప్రధాని, స్వాతంత్య్రసమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ పోరాడారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అధికారులు, నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుడి సేవలను స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్య్ర భారతదేశానికి ఒక దీపస్తంభంలా నిలిచారని, సామాజిక సమానత్వానికి, దళితుల హక్కుల కోసం బాబు జగ్జీవన్‌రామ్ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఉప ప్రధానిగా, కార్మిక, వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారని వివరించారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో, నిరంకుశ భేదాభిప్రాయాలను ఎదుర్కొంటూ, విద్య, విజ్ఞానం, విలువలతో ఆయన ఎదిగిన విధానం నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్, అంబాజీ, శంకర్, సిబ్బంది, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నివాళులు అర్పిస్తున్న కలెక్టర్, వివిధ సంఘాల నాయకులు
ఆర్జీయూకేటీలో..
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆదేశాల మేరకు ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీధర్శన్, ఏవో రణధీర్ జయంతి వేడుకలకు హాజరై బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించారు. మురళీదర్శన్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ అజయ్, డాక్టర్ విజయ్‌కుమార్, సతీశ్‌కుమార్, శంకర్, శ్యాంబాబు, శ్యాంసుందర్, దస్తగిరి, ఉపేందర్, నాగరాజు, హరికృష్ణ, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమానత్వం కోసం పోరాడిన జగ్జీవన్‌రామ్