
అడవిపందులు తరలిస్తున్న ముగ్గురిపై కేసు
భైంసాటౌన్: అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు భైంసా ఎఫ్‌ఆర్‌వో సట్ల వేణుగోపాల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కొందరు నియోజకవర్గంలో అడవి పందులను వేటాడి తరలిస్తున్నారన్న సమాచారంతో సోమవారం ముధోల్ మండలం బోరిగాం వద్ద తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా కట్ట గ్రామానికి చెందిన జాదవ్ సంజయ్, జాదవ్ అనిల్, పర్బని జిల్లా పూర్ణకు చెందిన కృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు బొలెరో వాహనంలో 13 అడవి పందులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పందులను స్వాధీనం చేసుకుని అడవిలో వదిలేసినట్లు తెలిపారు. నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌వో వెల్లడించారు. డీఆర్‌వో శంకర్, ముధోల్ ఎస్సై లక్ష్మణ్, మొగ్లి, దొడర్న వీవోలు కృష్ణ, లెనిన్ ఉన్నారు.