
వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు
అప్రమత్తంగా లేకపోతే ప్రాణానికి ముప్పు
‘సాక్షి’తో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్
నిర్మల్ చైన్‌గేట్: ఎండలు ముదురుతున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. భానుడి ప్రతాపంతో జనం ఇబ్బందిపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్. పెరుగుతున్న ఎండలు.. వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తతపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
సాక్షి: వడదెబ్బ లక్షణాలు ఏంటి?
డీఎంహెచ్‌వో: శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు లేదా 104 ఫారెన్ హీట్ వరకు పెరగడం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు, మైకం, హృదయ స్పందన పెరగడం, శ్వాసక్రియ రేటు పెరగడం, రక్తపోటు తగ్గడం, మూర్చ మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
సాక్షి: వడదెబ్బ తగిలిన వ్యక్తికి అందించాల్సిన ప్రథమ చికిత్స ఏమిటి?
డీఎంహెచ్‌వో: వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి చేర్చాలి. తర్వాత వెన్నుముకపై పడుకోబెట్టి మడమ కింద దిండు ఉంచాలి. దుస్తులను వదులు చేసి గుడ్డను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్ లేదా, కూలర్ గాలి తగిలేలా చూడాలి. ప్రథమ చికిత్స చేసిన 30 నిమిషాల తర్వాత పరిస్థితి మెరుగు పడకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
సాక్షి: వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వేసవిలో వ్యాపించే వ్యాధులు ఏమిటి?
డీఎంహెచ్‌వో: వాతావరణ శాఖ సూచన మేరకు ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రజలందరూ కూడా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ ద్రావణం, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, వంటివి ఇంట్లో తయారు చేసే పానీయాలను తీసుకోవాలి. ఇక వేసవిలో జలుబు, విరోచనాలు, డయేరియా, చికెన్ ఫాక్స్, మిజిల్స్, గవద బిల్లలు వంటివి సోకే ప్రమాదం ఉంది.
సాక్షి: ప్రస్తుత సీజన్లో ఎటువంటి పండ్లు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయ, కర్బుజా, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, కీరదోస వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లనే ఎక్కువగా తీసుకోవాలి.
సాక్షి: ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: ఎండ అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుకు తీసుకెళ్లాలి. తలకు టోపీగానీ, రుమాలు గానీ, ధరించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో పనిచేసే కూలీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి.
సాక్షి: వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
డీఎంహెచ్‌వో: ఎవరికై నా వడదెబ్బ తాకవచ్చు. శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.
సాక్షి: ఏ సమయంలో బయటకు వెళ్లాలి?
డీఎంహెచ్‌వో: వేసవిలో అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి. తప్పకుండా బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్, చేతి రుమాలు ధరించాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.
సాక్షి: ఎండాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉ త్తమం. నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార జీ ర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్ డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.
సాక్షి:ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయా?
డీఎంహెచ్‌వో: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 19 పీహెచ్‌సీలు, మూడు బస్తీ దవాఖానాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్యారాసెటమాల్, బీకాంప్లెక్స్ టాబ్లెట్లు, యాంటీబయటిక్స్ గోలీలు అందుబాటులో ఉంచాం. జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో