నర్వ సవిత(ఫైల్)
లింగంపేట: లింగంపేటకు చెందిన నర్వ సవిత (36) తన కూతురు పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన నర్వ ఆశయ్య, సవిత దంపతులకు కూతురు చందన, కుమారుడు చరణ్ ఉన్నారు. చందనకు 3 నెలల క్రితం సమీప బంధువుతో పెళ్లి కాయం చేసుకున్నారు. సదరు యువకుడు కొద్ది రోజుల క్రితం మరో అమ్మాయిని తీసుకొని గ్రామం నుంచి వెళ్లిపోయాడు. దాంతో అప్పటి నుంచి తన కూతురు వివాహం విషయంతో తరుచూ బాధపడేవారు. ఈ క్రమంలో సవిత ఈ నెల 15న పురుగుల మందు తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాదు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త ఆశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరగదని యువతి..
బిచ్కుంద: ప్రేమించిన యువకుడితో పెళ్లి జరగదని ఓ యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బిచ్కుందలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన దివ్యశ్రీ (21) శాంతాపూర్ గ్రామానికి చెందిన దత్తును ప్రేమించింది. ఆ యువకుడు ఆమెకు అన్నయ్య వరుస కావడంతో మరిచిపోవాలని దివ్యశ్రీ తల్లి సూచించింది. దీంతో ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరగదని మనస్తాపం చెందిన దివ్యశ్రీ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జీవితంపై విరక్తితో ఒకరు..
బిచ్కుంద: మండలంలోని ఫత్లాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ సాయిలు (30) జీవితంపై విరక్తి చెంది శనివారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సాయిలు కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఉపాధి దొరకక ఆర్ధిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
కుటుంబ కలహాలతో ఒకరు..
గాంధారి: కుటుంబ కలహాలతో మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన కాముని మైశయ్య(40) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణేష్ తెలిపారు. వివరాలు.. మైశయ్య 2012లో బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బులు ఎప్పటికప్పుడు భార్య యశోదకు పంపించాడు. అయితే నెల క్రితం మైశయ్య గ్రామానికి తిరిగి వచ్చాడు. కొత్త ఇల్లు నిర్మించుకుందామని, ఇప్పటి వరకు పంపించిన డబ్బులు లెక్క చెప్పాలని భార్యను అడిగాడు. తరువాత చెపుతానంటు భర్తకు నచ్చచెపుతూ వస్తుంది.
అయితే శుక్రవారం రాత్రి డబ్బుల విషయంలో భార్య భర్తతు గొడవ పడ్డారు. మైశయ్య భార్యను కొట్టాడు. తరువాత ఇద్దరు వరండాలో పడుకున్నారు. రాత్రి 1.30 ప్రాంతంలో మైశయ్య చిన్న కొడుకు సోమ్‌దాస్ సినిమాకు వెళ్లి ఇంటికి వచ్చి చూసే సరికి మైశయ్య గదిలో దూలానికి వేలాడుతు కనిపించాడు. యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై పేర్కొన్నారు. కాగా మైశయ్య మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment