ట్రాన్స్‌జెండర్‌కు ప్రమాదబీమా బాండ్ ఇస్తున్న హైకోర్డు న్యాయమూర్తి శ్రీ సుధ తదితరులు
ఖలీల్‌వాడి: ట్రాన్స్‌జెండర్లను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ అన్నారు. శనివారం జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్లకు పోస్టల్ శాఖ ద్వారా అమలవుతున్న గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ బాండ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను చిత్రీకరిస్తూ అష్ట గంగాధర్ రూపొందించిన వీడియోతో కూడిన పాటను ఆవిష్కరించారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదన్నారు.
వారికి అన్ని రంగాల్లో అవకాశాలు లభించేలా కృషి చేయాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా కేవలం రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ గార్డ్‌ను ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్లకు అందించడం అభినందనీయమన్నారు. దీనికి సహకరించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను ప్రశంసించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న పోస్టల్ ప్రమాద బీమా గురించి ప్రచారం కల్పించాలన్నారు.
జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. దాతలు ముందుకు వచ్చి రూ.30 వేలు విరాళం అందించినట్లు తెలిపారు. దీనిని 50 మందికి ప్రీమియం కోసం ఖర్చు చేసినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు జడ్జి, న్యాయాధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్
హైకోర్టు జడ్జి శ్రీసుధ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వా గతం పలికారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రెయినీ కలెక్టర్ కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీసీపీ(అడ్మిన్)మధుసూదన్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి తదితరులు స్వాగతం పలికారు. ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment