బీసీ సంఘాల సభ్యులతో చర్చలు జరుపుతున్న పెద్దమనుషులు
సాక్షి, నిజామాబాద్: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్ర గొడవకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో మంగళవారం దుర్గామాత శోభాయాత్ర ప్రారంభమైంది. ముదిరాజ్ సంఘానికి సంబంధించిన దుర్గామాత విగ్రహాన్ని శోభాయాత్రకు తరలిస్తుండగా అదే సమయంలో రెడ్డి యూత్‌కు సంబంధించిన డీసీఎం డీజే వ్యాన్‌ను తీసుకెళ్తున్నారు.
డీసీఎం వ్యాన్ డ్రైవర్ రెడ్డి వర్గానికి చెందినవాడు కావడంతో కావాలనే తమ దుర్గామాత విగ్రహాన్ని ఢీకొన్నాడని దీంతో దుర్గామాత చేతులు విరిగి పోయాయని, వెనుక ఉన్న ఇనుప స్టాండ్ ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరి వ్యక్తులపై పడి ప్రమాదం సంభవించేదని వారు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సంఘ సభ్యులు డీసీఎం వ్యాన్ అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని గొడవ పడొద్దని సూచించినా వారు వినలేదు.
బుధవారం ఉదయం విగ్రహం ధ్వంసమైన చోటే టెంట్ వేసుకుని 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు. సీఐ రామన్ పోలీస్ బందోబస్తు మధ్య ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల సభ్యులతో మాట్లాడారు. విగ్రహం ధ్వంసం కావడానికి కారకులైన రెడ్డి సంఘం నుంచి రూ. 5లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా పెద్ద మనుషుల ఒప్పందంతో రెండు తులాల బంగారం కొనుగోలు చేసి ఇస్తామని రెడ్డి సంఘం వారు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
విరిగిన దుర్గామాత చేతులను ప్లాస్టర్‌తో అతుకబెట్టి పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ వంకాయల రవి, వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ బీరయ్య, బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు బొంబాయి మల్లయ్య, బంజ శివకుమార్, పున్నం రాజయ్య, మర్కంటి దాకయ్య, జగ్గ బాల్‌రాజు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment