సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మోపాల్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ 11 ఏళ్లలో, బీఆర్‌ఎస్ పదేళ్లలో చేపట్టలేని పథకాలు, అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో రెట్టింపు చేసిందని, కానీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ మండల ఇన్‌చార్జి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగన్న, జిల్లా ఆదివాసీ, గిరిజన చైర్మన్ యాదగిరి, ఎన్‌డీసీసీబీ డైరెక్టర్ గొర్కంటి లింగం, మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ను కించపర్చిన చరిత్ర బీజేపీదన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని సూచించారు. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ప్రతి కార్యకర్త జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు గంగాప్రసాద్, కెతావత్ మోహన్, కిరణ్‌రావు, గుడి ప్రవీణ్‌రెడ్డి, ఆకుతోట సాయన్న, లక్ష్మారెడ్డి, దిలావర్ హుస్సేన్, రాజేశ్, రాజాకిషన్, సతీశ్‌రావు, శంకర్ పాల్గొన్నారు.
నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి