రుణమాఫీ కాకపోవడంపై రైతుల ఆగ్రహం
సిరికొండ: సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యంతో రుణాలు మాఫీ కాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభను బుధవారం నిర్వహించారు. సొసైటీలో ఆరు నెలల్లో జరిగిన లావాదేవీలను సీఈవో దేవీలాల్ సభలో చదివి వినిపించారు. రుణాలు మాఫీ కాని రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన తేదీ కంటే ముందే రుణాలు తీసుకున్నా ఆ వివరాలను సకాలంలో ఆన్‌లైన్ చేయకపోవడం వల్ల రుణమాఫీ వర్తించలేదన్నారు. గత మహాజన సభలో రుణాల మాఫీపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మాఫీ వచ్చేలా చూస్తామని చెప్పారని, ఆరు నెలలు గడిచినా రుణమాఫీ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోసైటీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రుణమాఫీ కాలేదని సొసైటీ ద్వారా మాకు రుణమాఫీ చేసి పట్టా పాసుపుస్తకాలు తిరిగి ఇచ్చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని 54 సొసైటీల్లో ఇలాంటి సమస్య ఉందని, అది ప్రభుత్వ దృష్టిలో ఉందని ప్రభుత్వం మాఫీ చేస్తేనే తప్ప సొసైటీ ద్వారా రుణ మాఫీ చేయడం కుదరదని సొసైటీ సీఈవో, పాలకవర్గ సభ్యులు సమాధానం ఇచ్చారు. చైర్మన్ రాములునాయక్, వైస్ చైర్మన్ అబ్బాస్, డైరెక్టర్లు లక్ష్మణ్, భీమన్న, రూప్‌సింగ్, రమేశ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.