ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ 11వ బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. యజ్ఞాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు 108 కలశాలల్లో ఉన్న గంగ నీటితో స్వామి వారికి ఉత్సవానంతరం అభిషేకం చేశారు. త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా పరిపూర్ణమయ్యాయని ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలను చాలా పెద్ద వేడుకగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూజాకార్యక్రమాల్లో గంగోత్రి రామానుజ దాసు స్వామితోపాటు ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, విజయసింహారెడ్డి దంపతులు, నర్సారెడ్డి, నరాల సుధాకర్, పృథ్వీ, రమేశ్, భాస్కర్, నరేందర్, మురళి, సురేశ్, రవి, చిన్నయ్య, సాయిలు, యజ్ఞాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
ధర్పల్లి: మండలంలోని సీతాయిపేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎంపీడీవో బాలకృష్ణ బుధవారం పరిశీలించారు. గ్రామంలో 8 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మాడల్‌ను అనుసరించి నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు ఎంపీడీవో సూచించారు.