
జీజీహెచ్‌కు రూ.3.50 కోట్లు
● మెడికల్ కాలేజ్, ఎంసీహెచ్‌లలో
అభివృద్ధి పనులకు నిధులు
● వైద్యవిభాగాలను తనిఖీ చేసిన డీఎంఈ
● నాలుగు గంటలపాటు సుదీర్ఘ పరిశీలన
● మాతాశిశు సంరక్షణ క్రిటికల్ కేర్‌లో
రెండు లిప్టుల ఏర్పాటు చేస్తాం
● డీఎంఈ నరేంద్రకుమార్ వెల్లడి
నిజామాబాద్ నాగారం : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.3.50 కోట్లు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ వెల్లడించారు. మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ విభాగంలో నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేయడంతోపాటు జీజీహెచ్‌ను అధునాతనంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, ఎంసీహెచ్, మెడికల్, నర్సింగ్ కాలేజీలను గురువారం రాష్ట్ర ఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజినీర్ దేవేందర్‌తో కలిసి డీఎంఈ పరిశీలించారు. సుమారు నాలుగు గంటలపాటు ఆస్పత్రిలో పర్యటించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చేపట్టాల్సిన మరమ్మతు పనులపై క్షేత్ర పర్యటనలో ఉన్న కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో గూగుల్ మీట్ ద్వారా సంప్రదించి చర్చించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో జీజీహెచ్ పనితీరు ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఈ మేరకు జీజీహెచ్‌ను సందర్శించినట్లు తెలిపారు. విడుదలైన నిధుల నుంచి రూ.కోటి 50 లక్షలతో జీజీహెచ్‌లో డ్రెయినేజీ వ్యవస్థ, ఆవరణలో పరిశుభ్రత, భవనానికి గ్లాసులు తదితర మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.30 లక్షలతో నర్సింగ్ కాలేజ్ భవనానికి మరమ్మతులు చేసి పీజీ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. వారి వెంట వైస్ ప్రిన్సిపాల్స్ జలగం తిరుపతిరావు, నాగమోహన్, ఎంఎస్‌ఐడీసీ ఈఈ కుమార్, సూపరింటెండెంట్ నాగరాజు, ప్రొఫెసర్లు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.