
న్యాయవాదుల సహకారం మరువలేనిది
ఖలీల్‌వాడి : జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో న్యాయవాదుల సహకారం మరువలేనిదని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్‌లో బార్ అధ్యక్షుడు మామిల్ల సాయారెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఉద్యోగరీత్యా బదిలీపై వచ్చానని, బదిలీపై వెళ్లడం సహజమని, పదవికి న్యాయం చేశా మా లేదా అనేదే ముఖ్యమని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున కక్షిదారులకు న్యాయ సేవలు అందించడంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సాయారెడ్డి, మాణిక్ రాజు మాట్లాడుతూ లోక్ అదాలత్‌లను విజయవంతం చేయడంలో న్యాయవాదులు క్రీయాశీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం జడ్జి పద్మావతిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు పాల్గొన్నారు.