అమెరికాలోని న్యూయర్క్ టైమస్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తేదీన బంగారు బతుకమ్మ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో 20 అడుగులఎత్తున తీర్చిదిద్దిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా, విదేశీయులను సైతం ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన బతుకమ్మ అలంకరణ, పాటలు, ఆటలు పండగ కాంతులు పంచాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ లతో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. బతుకమ్మలతో ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రకరకాల పూలతో అలంకరిచిన బతుకమ్మల అలంకరణ అందర్నీ విశేషంగా ఆకర్షించింది.
తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, దీపిక సమ్మెట ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు వైవిధ్యభరితమైన టైమ్ స్క్వేర్‌ని పూలవనంగా మార్చాయి. ఈ వేడుకలలో పాల్గొన్న తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రత్యేక ఉపన్యాసం చేసారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని కొనియాడారు. అలాగే సహకరించిన ఆడపడుచులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ మాట్లాడుతూ దేవుళ్ళని పూలతో పూజించే పూలనే దేవుళ్లుగా చేసి పూజించటంలోని విశిష్టతను గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు వినూత్నమైన కార్యక్రమాలతో సంస్థ ప్రతిష్టని మరింత పెంచే విధంగా బంగారు బతుకమ్మ ఉత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ కనులవిందుగా అలంకరించిన బతుకమ్మ టైమ్ స్క్వేర్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఇంత మంచి కార్యక్రమాన్ని న్యూయార్క్ నగరంలో చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. భారతీయ సంప్రదాయాలను, పండుగల గురి౦చి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తానాకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి, దక్షిణ ఆసియా వ్యవహారాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్.. తానా సంస్థకు మేయర్ జారీ చేసిన అభినందన పత్రాన్ని అందించారు.
ప్రత్యేక అతిథులుగా హాజరైన ప్రఖ్యాత టీవీ, సినీనటి అనసూయ, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, తమ ఆటపాటలతో హోరెత్తించారు. అలాగే మిమిక్రీ రమేష్ తమదైన హాస్యంతో ఆహుతులకు హాస్యాన్ని పంచారు. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టి పడేలా సంప్రదాయమైన అలంకరణలతో తెలుగు ఆడపడుచులు ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అలాగే సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించి ఆహూతులని ఆనందింపజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ ట్రస్టీ విశ్వనాథ్ నాయునిపాటి, ఫౌండేషన్ ట్రస్టీలు సుమంత్ రామిశెట్టి-విద్య గారపాటి-శ్రీనివాస్ ఓరుగంటి, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూయార్క్ దిలీప్ ముసునూరు, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూ ఇంగ్లాండ్ ప్రదీప్ గడ్డం, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కిరణ్ పర్వతాల ఆధ్వర్యంలో విశ్వవేదికపై కలకాలం గుర్తుండిపోయేలా తానా సంస్థ బతుకమ్మ సంబరాలను దిగ్విజయంగా నిర్వహించారు. అమెరికాలోని వివిధ నగరాలనుండి తానా సంస్థ నాయకులు నిర్మాత విశ్వప్రసాద్ పాటు ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, EVP నిరంజన్ శృంగవరపు, వెంకట్ చింతలపల్లి,సునీల్ కోగంటి, రవి పొట్లూరి, రవి మందలపు, సంస్థ ట్రస్టీ సభ్యులు రవి సామినేని, పద్మజ బెవర, మాధురి ఏలూరి, రాంచౌదరి ఉప్పుటూరి,శ్రీ అట్లూరి, ధృవ నాగండ్ల పాల్గొన్నారు.
అతిధులకు ‘బీంజ్ హోటల్’ న్యూయార్క్ వారి ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. అలాగే సహచర అమెరికా తెలుగు సంఘాలు TLCA, TTA, NYTTA సంస్థలకు, సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వారందరికీ తానా సంస్థ తరఫున తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment