దుబాయిలో ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా ఉన్న బుర్జ్ ఖలీఫా నమూనాను తయారు చేసి దాని శిఖరంపై చెరుకుగడల ఆకులు, గల్ఫ్ జెఏసీ జెండా నిలిపి దాని చుట్టూ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ వినూత్నమైన బతుకమ్మ వేడుకలు జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం బీమారం, కోరుట్ల మండలం చిన్న మెటుపల్లి గ్రామాలలో శనివారం (08.10.2022) రాత్రి మహిళలు నిర్వహించారు. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేలా... 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు అయ్యేలా దీవించాలని బతుకమ్మను వేడుకుంటూ పాటలు పాడారు. చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల మహిళలతో గ్రామంలోని ఆడపడుచులు అందరూ ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. వీడియోకాల్ లో ఉయ్యాలో... ఆట చూత్తావానే ఉయ్యాలో... ఆడియోకాల్ లో ఉయ్యాలో... పాట వింటవానే ఉయ్యాలో... అంటూ ఒక చెల్లెలు... గల్ఫ్ లో ఉన్న తన అన్నను సంబోధిస్తూ పాడే పాట అందరినీ ఆకర్షించింది.
దుబాయి లేజర్ షో కు దీటుగా... తెలంగాణలో కోటి చప్పట్ల బతుకమ్మ !
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఒక ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేల సమక్షంలో గత సంవత్సరం 2021 అక్టోబర్ 23న దుబాయి లోని బుర్జ్ ఖలీఫా వద్ద కోటి రూపాయలు ఖర్చు చేసి ఎడారి ఆకాశంలో బతుకమ్మ సంబరాల లేజర్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. బుర్జ్ ఖలీఫా స్క్రీన్ (తెర) పై లేజర్ షో ద్వారా బతుకమ్మ దృశ్య నివేదన జరిగింది. ఆకాశంలో పూల పండుగ చూసి ప్రపంచం అబ్బుర పడింది. దుబాయి లేజర్ షోకు పోటీగా తాము ఈ సంవత్సరం తెలంగాణ గడ్డపై కోటి చప్పట్ల బతుకమ్మ నిర్వహించామని బీమారం గ్రామానికి చెందిన గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. గల్ఫ్ దేశాలలో ఉన్న 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు, గల్ఫ్ నుంచి వెనక వచ్చి గ్రామాలలో స్థిరపడ్డ 30 లక్షల మంది కార్మికులు, వీరందరి కుటుంబ సభ్యులు కలిసి 'ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు' ఏర్పడిందని ఆయన అన్నారు
గల్ఫ్ నిర్మాణాల పునాదులు వారి చెమటతో తడిశాయి
గల్ఫ్ దేశాలలోని రంగు రంగుల ఆకాశ భవనాల నిర్మాణం వెనుక తెలంగాణ కార్మికుల కష్టం ఉంది. ఈ నిర్మాణాల పునాదులు కార్మికుల చెమటతో తడిశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గల్ఫ్ ప్రవాసుల పాత్ర అమోఘం. గుర్తింపుకు నోచుకోని అజ్ఞాత వీరులు, అజ్ఞాత శిల్పులైన మన ప్రవాసీ కూలీలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో వలస కార్మికులు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ సాధనలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పాత్ర మరువలేనిది. తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014 నుంచి ఈనాటి వరకు గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,600 కు పైగా తెలంగాణ కార్మికులు మరణించారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారు 2,000 కు పైగా మరణించారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ ప్రవాసీయులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment