అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ సిటీలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) పోర్ట్‌లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్ బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కోవిడ్-19 నేపథ్యంలో బతుకమ్మ వేడుకలకు దూరం కాకూడదని టీడీఎఫ్ బృందం వినూత్నంగా జూమ్ మీటింగ్ ద్వారా కమ్యూనిటీని కనెక్ట్ చేసి వేడుకల్ని నిర్వహించింది. పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల తన నివాసం నుంచి జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకల్ని ప్రారంభించారు.
అక్టోబర్ 24న శనివారం జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుంచి 70 కుటుంబాలు (దాదాపు 250మంది), జూమ్ యాప్ ద్వారా పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగురంగుల బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో హోరెత్తించారు. బతుకమ్మ నిమజ్జనం ఎవరి ఇళ్లల్లో వారు చేసుకుని గౌరమ్మ ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పోర్ట్‌లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా పోర్ట్‌లాండ్ చాప్టర్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. బతుకమ్మ పండుగని వైభవంగా జరగడానికి సాయం చేసి మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బతుకమ్మ విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ వేడుకల్ని మొదటిసారి ప్రత్యేక పరిస్థితుల్లో జూమ్ ద్వారా వైభవంగా నిర్వహించి విజయవంతం కావడానికి కృషి చేసిన టీమ్ సభ్యులు వీరేష్ బుక్క, నిరంజన్ కూర, సురేష్ దొంతుల, కొండల్ రెడ్డి పూర్మ, ప్రవీణ్ అన్నవజ్జల, నరేందర్ చీటి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, రాజ్ అందోల్, అజయ్ అన్నమనేని, రఘు శ్యామతో పాటు ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. వేడుకలను స్పాన్సర్ చేసినవారికి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment