మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - 'మాట'(Mana America Telugu Association) డల్లాస్ చాప్టర్ దసరా అలయ్ బలయ్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. టెక్సాస్‌లోని డ్రీమ్ డెస్టినేషన్ రాంచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో 3000 మందికి పైగా ప్రవాసులు పాల్గొని సందడి చేశారు. 'మాట' టీమ్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఈ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రావణ దహనం కార్యక్రమాన్నిఅట్టహాసంగా నిర్వహించారు. ప్రవాసుల కేరింతల నడుమ రావణ దిష్టిబొమ్మ దహనం చేశారు.
మాట సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, బిజెపి నాయకులు ప్రదీప్ రవికాంత్ ముఖ్య అతిథిలుగా విచ్చేసి, ప్రసంగించారు. 'మాట' డల్లాస్ చాప్టర్ రాజ్ సారథ్యంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, సన్మానించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలతో.. అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
మహిళలు ఆటా పాటలు, కోలాటాలతో సందడి చేశారు. మగవారు డప్పులతో డాన్సులు చేస్తూ.. ఆకట్టుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, స్పూర్తి తమ గాత్రంతో పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైనా ప్రతిఒక్కరికీ పసందైనా విందు భోజనం అందించారు.
ఇక ఈ వేడుకలు విజయవంతం అవడం పట్ల 'మాట' డల్లాస్ చాప్టర్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని సంస్థ సభ్యులు వివరించారు. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాట సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రవాసుల ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment