అమెరికాకి వెళ్లాలనే ఆశతో అక్రమంగా సరిహద్దులు దాటూతూ చనిపోయిన జగదీశ్ పటేల్ కుటుంబ అంత్యక్రియలు కెనాడాలో ముగిశాయి. జగదీశ్‌తో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలకు కూడా ఒకేసారి విన్నిపెగ్‌లో ఉన్న స్మశానంలో హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండ నిర్వహించారు.
చివరి చూపు
రెండు గంటల పాటు జరిగిన ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని ఇండియాలో ఉన్న అతని కుటుంబ సభ్యుల కోసం లైవ్‌స్ట్రీమింగ్ చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలోని దిగుంచా గ్రామంలో వంద మందికి పైగా జగదీశ్ పటేల్ బంధువులు ఈ అంత్యక్రియలు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. అమెరికా వెళ్లాలనే కోరిక చివరకు ఇంత దారుణానికి దారి తీస్తుందని తాము ఊహించలేదంటూ వాపోయారు. చివరి చూపుకు నోచుకోలేకపోయామంటూ బాధపడ్డారు. అటు ఆస్తులు హరించుకుపోయి ఇటు కుటుంబమంతా చనిపోయి దిక్కుతోచని స్థితిలో జగదీశ్ పటేల్ తండ్రి ఉన్నారు.
టీచరుగా ఉద్యోగం
జగదీశ్ పటేల్ గాంధీనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ అక్కడే కుటుంబంతో నివసించేవాడు. వివాదాల్లో తలదూర్చని సౌమ్యుడిగా అతనికి పేరుంది. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడటంతో 2020 మేలో సొంతూరికి వచ్చి తండ్రికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గత మూడు దశబ్ధాలుగా ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల మంది కెనడా, అమెరికా, యూకేలలో స్థిరపడ్డారు. దీంతో వారి బాటలోనే అమెరికా వెళ్లాలని జగదీశ్ పటేల్ నిర్ణయించుకున్నాడు.
20 ఎకరాలు అమ్మేసి
అమెరికాకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా స్థానిక ట్రావెల్ ఏంజెట్లను సంప్రదించాడు. నలుగురితో కూడిన ఓ కుటుంబాన్ని అమెరికాకి చేర్చేందుకు ఇక్కడ ఇంచుమించు రూ. 1.60 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ డబ్బు సమకూర్చేందుకు తన తండ్రికి చెందిన 20 ఎకరాల పొలం అమ్మేశాడు. మరికొంత అప్పు చేసి సర్థుబాటు చేశారు. మొత్తానికి జనవరి 10 ఇండియా నుంచి బయల్దేరి 12న కుటుంబంతో సహా కెనడా చేరుకున్నాడు జగదీశ్.
బాగానే ఉన్నాను
కెనాడకు చేరుకున్న తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడిన జగదీశ్ ఆ తర్వాత తన సమీప బంధువుకి ఫోన్ చేశాడు. అమెరికా సరిహద్దులో ఉన్న ఎమర్సన్ అనే పట్టణంలో ఓ హోటల్‌లో కుటుంబంతో బస చేసినట్టు చెప్పాడు. అమెరికా వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించాడు. అయితే తాము చీకట్లో నడక మార్గంలో సరిహద్దులు దాటుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు జగదీశ్.
అమెరికాకు 12 మీటర్ల దూరంలో
ఎమర్సన్ ప్రాంతంలో చలికాలంలో మైనస్ 30 సెల్సియస్ డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో జనవరి 19న రాత్రి వేళ కెనడా టూ అమెరికా ప్రయాణం మొదలైంది. జగదీశ్ అతని భార్య వైశాలి, కూతురు విహాంగి, కొడుకు ధార్మిక్‌లు కాలినడకన బయల్దేరారు. చివరకు అమెరికా సరిహద్దుకు కేవలం 12 మీటర్ల దూరంలో చలికి తాళలేక చనిపోయారు. పోలీసులు గుర్తించే సరికి నలుగురి మృతదేహాలు మంచులో కూరుకుపోయి ఉన్నాయి. వీరికి సమీపంలోనే మరో ఏడుగురు అచేత స్థితిలో ఉండగా స్థానిక అధికారులు కాపాడారు.
రెండు వారాలుగా
చనిపోయని జగదీశ్ కుటుంబ సభ్యుల మృతదేహాలను ఏం చేయాలనే అంశంపై వారం రోజులుగా ప్రతిష్టంభన ఏర్పడింది. మృతదేహాలను ఇండియాకు తీసుకురావాలంటే భారీ ఖర్చు తప్పనిసరిగా మారింది. జగదీశ్ కుటుంబం అమెరికా ప్రయాణం కోసం అప్పటికే కోటికి పైగా అప్పు తేవడం, ఉన్న పొలం అమ్మేయడంతో అతని తండ్రి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఫండ్ రైజింగ్
జగదీశ్ కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానిక ఎన్నారైలు చివరకు ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు. మొత్తం 80 వేల అమెరికన్ డాలర్లు పోగయ్యాయి. వీటితో ఫిబ్రవరి 7న కెనెడాలోని విన్నిపెగ్‌లో జగదీశ్ అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించారు. క్రౌడ్ ఫండ్‌లో మిగిలిన డబ్బులను జగదీశ్ తండ్రికి అందజేస్తామని స్థానిక ఎన్నారైలు తెలిపారు.
ఇంత దారుణమా
అమెరికా క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ట్రావెల్ ఏజెంట్ మాఫియా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు గుజరాత్‌తో పాటు ఎన్నారై వర్గాల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మాయమాటలు చెప్పి ప్రజల నుంచి డబ్బులు గుంజుతూ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారంటూ ఏజెంట్లపై మండిపడుతున్నారు. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
చదవండి: గుజరాత్‌లో ఎన్నారై మాఫియా? అక్రమ రవాణాకు కోట్ల రూపాయల వసూలు
Comments
Please login to add a commentAdd a comment