దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు. లాంటౌ ద్వీపం లో క్రొత్తగా నిర్మించబడ్డ వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడ పై అందమైన ఆకాశంలో నక్షత్రాల మెరుపుల క్రింద, రంగు రంగుల పూలతో అందంగా తయారైన గౌరమ్మను మెరిసే పట్టు చీరలు, నగలలో అందాల భామలు, అందమైన నవ్వులతో, పిల్ల - పాపలతో ఆడపడుచులందరూ చక చక తరిలి వచ్చారు.
తుంగ్ చుంగ్ మెట్రో స్టేషన్ నుండి కేవలం కొద్ది దూరంలో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్, జాగర్స్, బైకర్స్, డాగ్ వాకర్స్ మరియు విహార యాత్రలకు వచ్చే వారితో ప్రసిద్ది చెందింది, ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రక్రుతిని ఆస్వాదించటానికి సరైన ప్రదేశం. హాంకాంగ్, న్యూ టెరిటరీస్ లో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్ 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్క్ సహజ దృశ్యాలతో పాటు, ఈ పార్కులో పిల్లలు, పెద్దలు మరియు వయో వృద్ధులు అందరికి అనువైన అందమైన విహార స్థలం.
చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు తంగేడు, గునుగు మొదలగు పూలను ఇంటిళ్ళపాదీ స్నేహితులు కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.ఈ పూలను జాగ్రత్తగా ఒక పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చి, ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు.
మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. చీకటి పడుతుండగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని వాటర్ ఫ్రంట్ కి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు లో బతుకమ్మ పాటలు బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో పాడుతూ అందంగా అలంకిరించుకున్నబాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. చూస్తున్న స్థానికులు ఆశ్చర్యంగా , ఆనందంగా చూస్తూ ఫోటోలు తీసుకుంటారు.
సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ప్రోమేనాడ చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడి పాడారు. ఇలా చాలా సేపు ఆడాక గౌరమ్మను పూజించి వెళ్ళి రావే బతుకమ్మ అంటూ సముద్రంలో నిమజ్జనం చేసారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన సత్తుపిండి (మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) వాయనాలను ఇచ్చి పుచ్చుకొని ప్రసాదం సేవించారు.
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరవ సంవత్సరం జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని ఆనందంగా తెలుపుతూ, ఈ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. THKTS సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని అన్నారు. నవంబర్ లో కార్తిక వనభోజనాలు మరియు దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment