విదేశాల్లో సత్తా చాటుతున్నారు ప్రవాస భారతీయులు. ఇప్పటికే వివిధ దేశాల చట్ట సభల్లో అనేక మంది చోటు సాధించి తమదైన ముద్ర వేశారు. తాజాగా ప్రసిద్ది చెందిన లండన్ పోలీస్ కమిషనర్ రేసులో ప్రవాస భారతీయుడు అనిల్ కాంతి నీల్ బసు ఉన్నట్టుగా బ్రిటీష్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు.
అనిల్ కాంతి నీల్ బసు తండ్రిది కోల్‌కతా. ఆయనకొక సర్జన్. 1961లో ఇంగ్లండ్ షిఫ్ట్ అయ్యారు. ఆయన భార్య ఓ నర్సు. అనిల్ కాంతి బసు యూకేలోనే పుట్టి పెరిగారు. నాటింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నాక 1992లో మెట్ పోలీస్‌శాఖలో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కౌంటర్ టెర్రరిజమ్ చీఫ్‌గా, స్పెషలిస్ట్ ఆపరేషన్స్ బాస్‌గా పని చేశారు.
ఇంగ్లండ్ పోలీస్ శాఖలో అనిల్‌కాంతికి మంచి పేరుంది. ఎంఐ 15, యూకే డొమెస్టిక్ సర్వీస్‌లో సైతం అనిల్ కాంతిపై సదాభిప్రాయం కలిగి ఉంది. లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న క్రెసిడా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.దీంతో కొత్త కమిషనర్ ఎంపిక అనివార్యంగా మారింది. ఈ పదవి కోసం ఎంపిక చేసిన పోలీసు అధికారుల తుది జాబితాలో అనిల్‌కాంతి ఉన్నట్టు బ్రిటీష్ మీడియా పేర్కొంటుంది.
ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్‌తో అనిల్ కాంతిల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నట్టు బ్రిటీష్ మీడియాలో మరో వర్గం వాదిస్తోంది. హోం సెక్రటరీ పదవిలో ప్రీతీ ఉండగా లండన్ పోలీస్ కమిషనర్ పదవి కాంత్రి బసుకు రాకపోవచ్చని చెబుతోంది. అయితే క్రైం ఇన్విస్టిగేషన్‌లో దిట్టగా పేరున్న అనిల్ కాంతికి లండన్ పోలీస్ కమిషనర్ పోస్టు రాని పక్షంలో స్కాట్‌లాండ్ యార్డ్ చీఫ్ పోస్టయినా దక్కే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment