లండన్: ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ సాగే బతుకమ్మ పాటలతో లండన్ నగర వాసులు పులకించిపోయారు. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలు, వాటి చుట్టూ ఆడపడుచుల చప్పట్లు, కట్టె కోలాటాలతో ఆంగ్లేయుల రాజధాని కొత్త శోభను సంతరించుకుంది. ఈసారి జరిగిన వేడుకల్లో లండన్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కోలాహాలంగా ఈ వేడుకలు జరిగాయి.
1500ల మందితో
లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దాదాపు 1500ల మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో ఈ ఏడాది కూడా యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు. మొదట దుర్గా పూజతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఇండియా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన జమ్మి చెట్టు కు పూజ నిర్వహించారు. ఆ తర్వాత బతుకమ్మ ఆట, కట్టే కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ... భారత దేశ సంస్కృతి, కళలని ప్రోత్సహిస్తున్న తెలంగాణ ఎన్నారై ఫోరంని అభినందించారు. పువ్వులనే దేవతగా పూజించే సంస్కృతి ఎంతో గొప్పదని కొనియాడారు.
అరుదైన సందర్భం
భారతీయ సంప్రదాయాలు కాపాడలిసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. తొమ్మిదేళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణ ఎన్నారైలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరో లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. వేల మంది మహిళలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుందని, అలాంటి సందర్భంగం బతుకమ్మతో వచ్చిందన్నారను. బతుకమ్మలో తనను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ కళలకు ప్రచారం
ఈ వేడుకల్లో పాల్గొన్న స్థానిక మేయర్ బిష్ణు మాట్లాడుతూ... లండన్‌లో హిందూ పండుగల నిర్వహించడం, భారతీయ సంప్రదాయాలని సజీవంగా ఉంచడాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ.. యూరోప్ లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహించేందుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధిపేట గొల్లభామ, సిరిసిల్ల చేనేత, ఫిలిగ్రి , పెంబర్తి ఇత్తడి , నిర్మల్ బొమ్మలని వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్నామని వివరించారు. 2017 నుంచి లండన్‌లో బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ చెప్పారు.
అందరి కృషితో
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గంగసాని ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, కార్యదర్శి మహేష్ జమ్మల వెంకట్ స్వామి, బాలకృష్ణరెడ్డి, మహేష్ చాట్ల, నరేంద్ర వర్మ, స్వామి ఆశ రాజు కొయ్యడ, ఆకుల శ్రీనివాస్, వెంకట్రెడ్డిలు కృషి చేశారు. మహిళా విభాగం నుంచి మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, జయశ్రీ, సవిత జమ్మల, దివ్య, అమృతలు కీలకంగా వ్యవహరించారు. ఈ వేడుకల నిర్వాహణకు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందించింది. వేడుకలు ముగిసిన తర్వాత బాలాజీ లడ్డూ ప్రసాదం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment