అమెరికాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం మొత్తం శవమై తేలింది. కేరళకు చెందిన వీరిని ఆనంద్ సుజిత్ హెన్రీ (42) ఆలిస్ ప్రియాంక(40), నాలుగేళ్ల కవల పిల్లలు నోహ్, నీతాన్‌లుగా గుర్తించారు. తుపాకీ గాయాలతో కాలిఫోర్నియాలోని సొంత ఇంటిలో వీరు చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
భారతీయ-అమెరికన్ ఐటీ జంట ఆనంద్, ఆలిస్ బాత్రూమ్‌లో తుపాకీ గాయాలతో చనిపోయి కనిపించగా, కవల పిల్లలిద్దరూ బెడ్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతోపాటు బాత్‌రూమ్‌లో 9ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.దీంతో ప్రాథమికంగా హత్య-ఆత్మహత్య కేసుగా భావిస్తున్న శాన్ మాటియో కౌంటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CIB) ఈ కేసును విచారిస్తోంది.
వీరు గత తొమ్మిదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆనంద్ , సీనియర్ అనలిస్ట్ ఆలిస్ రెండేళ్ల క్రితం న్యూజెర్సీ నుండి శాన్ మాటియో కౌంటీకి మకాం మార్చారు. వీరిద్దరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారనీ, కష్టపడి పనిచేసే జంట అని అటు పొరుగువారు, సహోద్యోగులు చెబుతున్నమాట.
విడాకుల కోసం అప్లయ్
అయితే కోర్టు రికార్డుల ప్రకారం, కవల పిల్లలు పుట్టకముందే ఆనంద్ 2016 డిసెంబర్‌లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంకా విడాకులు మంజూరుకాలేదు. అలాగే వీరు 2020లో 2.1 మిలియన్ డాలర్ల ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఎవరీ హెన్రీ, ప్రియాంక
హెన్రీ , ప్రియాంక ఇద్దరూ కేరళలోని కొల్లంలో టీకేఎం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు. హెన్రీ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే, ప్రియాంక సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. వీరు ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
హెన్రీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం ,సింగపూర్ మేనేజ్‌మెంట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. అలాగే గత సంవత్సరం జూన్‌లో మెటాలో జాబ్ వదిలి పెట్టి సొంత ఏఐ సంస్థ లాజిట్స్‌ను స్థాపించాడు. గతంలో గూగుల్,సేల్స్ ఫోర్స్, సీఎంయూకంపెనీల్లో పనిచేశారు. అంతేకాదు హెన్రీ కొల్లం ఫాతిమా మాతా నేషనల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ హెన్రీ జార్జ్ కుమారుడని తెలుస్తోంది.
కాగా ఇటీవల మసాచుసెట్స్‌లో భారతీయ సంతతికి చెందిన సంపన్న కుటుంబం, వారి కుమార్తె చనిపోయిన తరువాత అలాంటి మరో ఘటన ఆందోళన రేపింది. ఈ కేసులో కుటుంబ పెద్దే తన భార్యాపిల్లలను చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. గత నెలలో, అమెరికాలో కనీసం ఏడుగురు భారతీయ విద్యార్థులు మరణించారు. భారతీయ విద్యార్థులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఉండేలా చూసేందుకు అమెరికా కట్టుబడి ఉందని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment