ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి, ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించడానికి వేదికను అందించడం అనే అంకితభావనతో సేవలను అందిస్తున్న సంస్థ. దాదాపు రెండు దశాబ్దాలుగా, హాంగ్ కాంగ్ లో భారతీయ సంస్కృతిని చురుకుగా ప్రచారం చేస్తోంది. భారతదేశంలోని విభిన్న కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వారి ప్రయత్నాలు భారతీయ సంప్రదాయాలను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా హాంగ్ కాంగ్ లోని భారతీయ ప్రవాసులలో సమైఖ్యత - సమ భావాన్ని సృష్టించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.ఇటీవల, వారధి ఫౌండేషన్ (హైదరాబాద్) మరియు శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) వారి సహకారంతో హాంగ్ కాంగ్ లో “మార్గం” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. శాస్త్రీయ నృత్యం భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి నారాయణి గాయత్రి ఈయుణ్ణి సోలో రిసైటల్ ఏర్పాటు చేసారు .
హాంగ్ కాంగ్ నివాసులైన శ్రీ.రాజీవ్ ఈయుణ్ణి మరియు శ్రీమతి.అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి. గురు కలైమామణి డా.రాజేశ్వరి సాయినాథ్ గారి శిష్యరికంలో ఇటీవలే ఆగస్టు 2023లో హైదరాబాద్ లో తన ఆరంగేట్రం చేసి అందరి మన్ననలు పొందింది. ఆమె సాధించిన ఆరంగేట్ర విజయాన్ని పురస్కరించుకుని, హాంగ్‌కాంగ్‌లోని లాంటౌ ద్వీపంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్‌లో 6 జనవరి 2024న నృత్య ప్రియులకు, ఆమె ఆరంగేత్రం నుండి కొన్నిఅంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాంగ్ కాంగ్ & మకావులోని భారత కాన్సుల్ జనరల్ హాజరై, ప్రారంభోత్సవం చేశారు, వారు గాయత్రి మరియు ఆమె తల్లిదండ్రులను శాస్త్రీయ కళారూప సంస్కృతిని కొనసాగించడాన్నిఅభినందించారు మరియు గాయత్రికి ప్రశంసా పత్రాన్ని అందించి ప్రశంసించారు. హాంగ్ కాంగ్లోని వివిధ శాస్త్రీయ నృత్య-సంగీత గురువులు కూడా హాజరయ్యారు.
దీప ప్రజ్వలన తరువాత, గాయత్రి కర్ణాటక సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె శ్రావ్యమైన స్వరం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. గాయత్రి తల్లి శ్రీమత అపర్ణ, ప్రతి నాట్య అంశాన్ని లయబద్ధంగా వివరిస్తూ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయత్రి తన అందమైన సాంప్రదాయ భరతనాట్య వేషధారణలో సంప్రదాయ ఆవాహనతో ప్రారంభిన్చింది. పుష్పాంజలి, అల్లారిపు, దేవీ స్తుతి, ముద్దుగారే యశోధ, తిల్లానా, మరియు మంగళం వంటి అభినయ అంశాలని అద్భుతంగా ప్రదర్శిస్తూ.. చక్కని హావ భావాలతో అందరిని ఆకట్టుకుంది. ఆమె మనోహరమైన కదలికలు మరియు వ్యక్తీకరణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆమె ప్రతిభ మరియు ఆమెకు కళ పట్ల గల అంకితభావం ఆమె నృత్యంలో స్పష్టంగా కనిపించాయి, అలా ఆమె ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలను అందుకుంది. గాయత్రి అభినయ చాతుర్యం, ఆమె కృషి మరియు అంకితభావం ఈ తరం యువతకి చక్కని నిదర్శనం.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుట్, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్ పాల్గొన్నారు . ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి స్పందిస్తూ, మనోహరంగా సాగిన “మార్గం” లో నారాయణి గాయత్రి ఈయుణ్ణి ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి, తమ సమాఖ్య లక్ష్యం యొక్క నిజమైన ప్రతిబింబంమని .. గాయత్రి వంటి వర్ధమాన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, భారతీయ సంప్రదాయాలు - సంస్కృతిని అనుసరించడానికి ఇతరులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం సరైన వేదిక యని అందుకు తమ సమాఖ్య సదా సిద్ధమే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment