![Proudly Swarakalpana 1st Year Anniversary - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/20/singapore.jpg.webp?itok=nh_Tkdw2)
విద్యా సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారంతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎందరో గురువులు, కళాకారులు తమవంతు కృషిచేస్తూ పాటలు రాస్తున్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ, మరిన్ని కొత్త పాటలను వెలుగులోకి తీసుకు వచ్చేలా స్వరకల్పన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్‌లో జరిగిన ఈ కార్య క్రమంలో అన్నమయ్య కీర్తనలు, వర్ణాలు, చక్కటి తిల్లానాతో మరిన్ని శాస్త్రీయ కృతులు తెలుగు వారిని అలరించాయి. ఈ వేడుకలలో ప్రఖ్యాత గురువులు లహరి కొలచెల, డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్, తాడేపల్లి సుబ్బలక్ష్మి , మోదుమూడి సుధాకర్, ద్వారం వీకేజీ త్యాగరాజ్, డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్నుభట్ల రామచంద్రమూర్తి, కమలాదీప్తిలు పాడిన కీర్తనలు శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అంతేకాదు ఈ రచనలన్నీ కొటేషన్స్ తో సహా ఒక ఈ-పుస్తకరూపంలో కూడా ప్రచురించారు. ఈ సందర్భంగా స్వరకల్పన సమారాధన నిర్వహాకులు మాట్లాడుతూ గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11 మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థికసహాయాన్ని కూడా అందించినట్లు తెలిపారు. భారత్‌తో పాటు సింగపూర్, అమెరికా, యూకే, మలేషియాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment