భారతీయ చేనేత కళాకారులను, నేత కార్మికులను ప్రోత్సహించడానికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా లండన్‌లో బ్రిటిష్ ఉమెన్ ఇన్ శారీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్, ఐఐడబ్ల్యూ సహకారంతో లండన్‌లో శారీ వాకథాన్-2023 నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మందికిపైగా భారతీయ మహిళలు వారి సాంప్రదాయ చేనేత చీరలు ధరించి కార్యక్రమానికి తరలివచ్చారు.
వారంతా తమ ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ సెంట్రల్ లండన్‌లోని చారిత్రక ప్రదేశాల మీదుగా నడిచారు. ఈ వాకథాన్ ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి ప్రారంభమై, 10 డౌనింగ్ స్ట్రీట్ దాటి, మన జాతీయ గీతం, కొన్ని ప్రాంతీయ ప్రదర్శనలతో పార్లమెంట్ స్క్వేర్ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు ముగిసింది.
తెలంగాణకు చెందిన గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గొల్లభామ వంటి చేనేత చీరలతో 40 మందిపైగా తెలంగాణ మహిళల బృందం ఈ వాకథాన్ 2023లో పాల్గొంది. భారతీయ చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు, భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా అంతర్జాతీయ ప్రదర్శనలు చేనేత కార్మికుల జీవనోపాధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలంగాణ కోఆర్డినేటర్లు ప్రతిమ, జ్యోతి, అనూష, సాధన, సింధు, గోదా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment