SiliconAndhra University Celebrates 5th Graduation Ceremony - Sakshi
Sakshi News home page

సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం

Published Tue, Jun 6 2023 11:50 AM | Last Updated on Tue, Jun 6 2023 12:16 PM

Siliconandhra University 5th Graduation Ceremony - Sakshi

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. టెక్ మహీంద్రా కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ హర్షుల్ అస్నానీ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేయగా, విశ్వవిద్యాలయ బోర్డు ట్రస్టీలు, వివిధ శాఖల అధిపతులు వేదికనలంకరించగా, విద్యార్థులు, వారి బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ ఉత్సవం ఒక పండుగ లాగా జరిగింది. గత ఏడు సంవత్సరాలుగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భరతనాట్యం, కూచిపూడి, కర్ణాటిక సంగీతం, హిందుస్తానీ, తెలుగు, సంస్కృత విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ కోర్సులను అందజేస్తోంది. అందులో భాగంగా 2022-23 విద్యాసంవత్సరానికి 65 మంది విద్యార్థులు తమ కోర్సులలో ఉత్తీర్ణులై ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు.  

తొలుత శ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారి వేద పఠనంతో సభ మొదలయింది. కుమారి ఈషా తనుగుల అమెరికా జాతీయ గీతాలాపన అనంతరం విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల అధ్యక్షోపన్యాసం చేస్తూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల చరిత్రల్లో అతి తక్కువ కాలంలోనే WASC గుర్తింపు పొందిన ఏకైక విశ్వవిద్యాలయం తమదేనని ఆహూతులకు గుర్తుచేశారు. ఈ విద్యా సంవత్సరం నించి MS కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రారంభిస్తున్నామని, ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులకు అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వీలుగా I -20 లు మంజూరు చేయడానికి తమ సంస్థకు అమెరికా నించి అనుమతి లభించిందని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తెలియజేసారు. 

పురాతన భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని, అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మేళవించి రూపొందించే కోర్సులతో, వైద్య, ఆయుర్వేద, యోగ, నర్సింగ్ వంటి శాఖలు యూనివర్సిటీలో అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, ఎప్పటిలాగే వాటికీ అందరి సహాయ సహకారాలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అనంతరం విశ్వవిద్యాలయ బోర్డు ఛైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ ఏడేళ్ళ క్రితం ఒక గోప్ప ఆశయం, లక్ష్యంతో మొదలైన ఈ కల, భారతీయ భాషలు, కళలకే పరిమితం కాకుండా అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దీటుగా సమీప భవిష్యత్తులో ట్రేసీ నగరంలో 67 ఎకరాల్లో నిర్మింపబోయే సొంత ప్రాంగణంతో అన్ని రంగాల్లో విద్యాబోధన చేస్తుందని ప్రకటించారు. 

ముఖ్య అతిథి హర్షుల్ అస్నానీ స్నాతకోపన్యాసం చేస్తూ విద్యార్థులను ఉద్దేశించి మిమ్మల్ని పట్టభద్రులనాలా లేక కళాకారులనాలా అని తేల్చుకోలేక పోతున్నాను అని చమత్కరించారు. తాను సాంకేతిక రంగం నుంచి వచ్చినందున భాషా, కళా రంగాల్లో పట్టభద్రులైన వారికి ఆ రంగానికి సంబంధించిన సలహాలు ఇవ్వలేకపోయినా ఏ రంగంలోనైనా రాణించడానికి, తను అవలంబించే ఐదు సూత్రాల ప్రణాళికను విద్యార్థులతో పంచుకున్నారు. 

జీవితంలో ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఉండమని, ఎవ్వరు ఏమి చెప్పినా ఎప్పుడూ స్వశక్తి మీద నమ్మకం కోల్పోవద్దని, ఉద్యోగంతో పాటూ మరేదైనా వ్యాసంగం చేపట్టమని, కృతజ్ఞతా భావంతో జీవితం గడపమని, అందరిపట్ల దయతో ఉండమని ఉద్బోధించారు. విశ్వవిద్యాలయ ప్రోవోస్ట్ చమర్తి రాజు ముఖ్య సంపాదకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో బోర్డు మెంబర్ డాక్టర్ జ్ఞానదేవ్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ జర్నల్ శాస్త్రను విడుదల చేశారు. విద్యార్థులంతా లేచి నిలబడగా యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల అధికారికంగా విద్యార్థులకు డిగ్రీలను ప్రకటించారు.

విశ్వవిద్యాలయ ప్రధాన విద్యాధికారి రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం పట్టాలు పొందిన వారిలో హైస్కూల్ స్థాయి విద్యార్థులనించి విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారి వరకు ఉండడం విశేషమని, అంతేకాక విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఒక్క అమెరికా నుంచే కాక భారతదేశం సింగపూర్ మలేషియా వంటి దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థులు ఒక్కొక్కరుగా వేదిక మీదకు వచ్చి స్నేహితుల బంధువుల హర్షద్వానాల మధ్య తమ  పట్టాలు పుచ్చుకున్నారు.

విశ్వవిద్యాలయ బోర్డు కీలక సభ్యులు రిచర్డ్ ఆస్బోర్న్ ముగింపు ఉపన్యాసం చేస్తూ భారతీయ కళలు ఒక ఆదర్శ జీవిత విధానాన్ని ఎలా అవలంబించాలో అన్యాపదేశంగా నేర్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగం చాట్ జిపిటి తయారు చేసిందని, తన సొంతది కాదని చమత్కరిస్తూ సాంకేతిక రంగంలో వచ్చే మార్పులను  స్వీకరిస్తూ పురాతన శాస్త్రీయ వైభవాన్ని నిలుపుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలంటూ పిలుపునిచ్చారు. వేదిక అలంకరించిన ఇతర ప్రముఖులు బోర్డు సభ్యులు, కల్వచెర్ల  ప్రభాకర్, డాక్టర్ బారీ రాయన్, ఏమీ కాట్లిన్, ఎలిజబెత్ షూమేకర్, మరియు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ మృణాళిని చుండూరి, సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ వసంతలక్ష్మి, కూచిపూడి భరతనాట్య విభాగాల నుంచి డాక్టర్ యశోద ఠాకూర్, డాక్టర్ కరుణ విజయేంద్రన్, డాక్టర్ అనుపమ కౌశిక్ లు ఉన్నారు. 

కార్యక్రమం సజావుగా జరగడానికి విశేషంగా కృషి చేసిన విశ్వవిద్యాలయ సిబ్బంది డాక్టర్ కార్తీక్ పటేల్, మమతా కూచిభొట్ల, సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం లకు ఆనంద్ కూచిభొట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరూ తమ కుటుంబాలతో, స్నేహితులతో ఫోటోలు తీసుకుంటూ యాజమాన్యం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ సందడిగా ఆ సాయంత్రం కార్యక్రమం ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement