SiliconAndhra University
-
సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. టెక్ మహీంద్రా కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ హర్షుల్ అస్నానీ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేయగా, విశ్వవిద్యాలయ బోర్డు ట్రస్టీలు, వివిధ శాఖల అధిపతులు వేదికనలంకరించగా, విద్యార్థులు, వారి బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ ఉత్సవం ఒక పండుగ లాగా జరిగింది. గత ఏడు సంవత్సరాలుగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భరతనాట్యం, కూచిపూడి, కర్ణాటిక సంగీతం, హిందుస్తానీ, తెలుగు, సంస్కృత విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ కోర్సులను అందజేస్తోంది. అందులో భాగంగా 2022-23 విద్యాసంవత్సరానికి 65 మంది విద్యార్థులు తమ కోర్సులలో ఉత్తీర్ణులై ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు. తొలుత శ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారి వేద పఠనంతో సభ మొదలయింది. కుమారి ఈషా తనుగుల అమెరికా జాతీయ గీతాలాపన అనంతరం విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల అధ్యక్షోపన్యాసం చేస్తూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల చరిత్రల్లో అతి తక్కువ కాలంలోనే WASC గుర్తింపు పొందిన ఏకైక విశ్వవిద్యాలయం తమదేనని ఆహూతులకు గుర్తుచేశారు. ఈ విద్యా సంవత్సరం నించి MS కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రారంభిస్తున్నామని, ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులకు అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వీలుగా I -20 లు మంజూరు చేయడానికి తమ సంస్థకు అమెరికా నించి అనుమతి లభించిందని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తెలియజేసారు. పురాతన భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని, అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మేళవించి రూపొందించే కోర్సులతో, వైద్య, ఆయుర్వేద, యోగ, నర్సింగ్ వంటి శాఖలు యూనివర్సిటీలో అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, ఎప్పటిలాగే వాటికీ అందరి సహాయ సహకారాలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అనంతరం విశ్వవిద్యాలయ బోర్డు ఛైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ ఏడేళ్ళ క్రితం ఒక గోప్ప ఆశయం, లక్ష్యంతో మొదలైన ఈ కల, భారతీయ భాషలు, కళలకే పరిమితం కాకుండా అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దీటుగా సమీప భవిష్యత్తులో ట్రేసీ నగరంలో 67 ఎకరాల్లో నిర్మింపబోయే సొంత ప్రాంగణంతో అన్ని రంగాల్లో విద్యాబోధన చేస్తుందని ప్రకటించారు. ముఖ్య అతిథి హర్షుల్ అస్నానీ స్నాతకోపన్యాసం చేస్తూ విద్యార్థులను ఉద్దేశించి మిమ్మల్ని పట్టభద్రులనాలా లేక కళాకారులనాలా అని తేల్చుకోలేక పోతున్నాను అని చమత్కరించారు. తాను సాంకేతిక రంగం నుంచి వచ్చినందున భాషా, కళా రంగాల్లో పట్టభద్రులైన వారికి ఆ రంగానికి సంబంధించిన సలహాలు ఇవ్వలేకపోయినా ఏ రంగంలోనైనా రాణించడానికి, తను అవలంబించే ఐదు సూత్రాల ప్రణాళికను విద్యార్థులతో పంచుకున్నారు. జీవితంలో ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఉండమని, ఎవ్వరు ఏమి చెప్పినా ఎప్పుడూ స్వశక్తి మీద నమ్మకం కోల్పోవద్దని, ఉద్యోగంతో పాటూ మరేదైనా వ్యాసంగం చేపట్టమని, కృతజ్ఞతా భావంతో జీవితం గడపమని, అందరిపట్ల దయతో ఉండమని ఉద్బోధించారు. విశ్వవిద్యాలయ ప్రోవోస్ట్ చమర్తి రాజు ముఖ్య సంపాదకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో బోర్డు మెంబర్ డాక్టర్ జ్ఞానదేవ్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ జర్నల్ శాస్త్రను విడుదల చేశారు. విద్యార్థులంతా లేచి నిలబడగా యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల అధికారికంగా విద్యార్థులకు డిగ్రీలను ప్రకటించారు. విశ్వవిద్యాలయ ప్రధాన విద్యాధికారి రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం పట్టాలు పొందిన వారిలో హైస్కూల్ స్థాయి విద్యార్థులనించి విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారి వరకు ఉండడం విశేషమని, అంతేకాక విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఒక్క అమెరికా నుంచే కాక భారతదేశం సింగపూర్ మలేషియా వంటి దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థులు ఒక్కొక్కరుగా వేదిక మీదకు వచ్చి స్నేహితుల బంధువుల హర్షద్వానాల మధ్య తమ పట్టాలు పుచ్చుకున్నారు. విశ్వవిద్యాలయ బోర్డు కీలక సభ్యులు రిచర్డ్ ఆస్బోర్న్ ముగింపు ఉపన్యాసం చేస్తూ భారతీయ కళలు ఒక ఆదర్శ జీవిత విధానాన్ని ఎలా అవలంబించాలో అన్యాపదేశంగా నేర్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగం చాట్ జిపిటి తయారు చేసిందని, తన సొంతది కాదని చమత్కరిస్తూ సాంకేతిక రంగంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూ పురాతన శాస్త్రీయ వైభవాన్ని నిలుపుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలంటూ పిలుపునిచ్చారు. వేదిక అలంకరించిన ఇతర ప్రముఖులు బోర్డు సభ్యులు, కల్వచెర్ల ప్రభాకర్, డాక్టర్ బారీ రాయన్, ఏమీ కాట్లిన్, ఎలిజబెత్ షూమేకర్, మరియు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ మృణాళిని చుండూరి, సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ వసంతలక్ష్మి, కూచిపూడి భరతనాట్య విభాగాల నుంచి డాక్టర్ యశోద ఠాకూర్, డాక్టర్ కరుణ విజయేంద్రన్, డాక్టర్ అనుపమ కౌశిక్ లు ఉన్నారు. కార్యక్రమం సజావుగా జరగడానికి విశేషంగా కృషి చేసిన విశ్వవిద్యాలయ సిబ్బంది డాక్టర్ కార్తీక్ పటేల్, మమతా కూచిభొట్ల, సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం లకు ఆనంద్ కూచిభొట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరూ తమ కుటుంబాలతో, స్నేహితులతో ఫోటోలు తీసుకుంటూ యాజమాన్యం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ సందడిగా ఆ సాయంత్రం కార్యక్రమం ముగిసింది. -
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది. ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి వాయులీన గానంతో అలరించారు. వారికి అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు. చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు. -
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC గుర్తింపు
కాలిఫోర్నియా: భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC(Western Association of Schools and Colleges) గుర్తింపు లభించింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులచే ఇటువంటి విశ్వవిద్యాలయం నెలకొల్పబడటం ప్రథమం. విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు లభించడం ప్రప్రథమం. కాలిఫోర్నియా రాష్ట్రంలో పేరొందిన స్టాన్ ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ, లాస్ఎంజిల్స్ విశ్వవిద్యాలయాలకు ఉన్న గుర్తింపు ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి లభించింది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయ స్థాయిలో పట్టంగట్టి, ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకమని, ఈ అపూర్వ ఘట్టాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆచార్య పప్పు వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం మరిన్ని భారతీయ కళలు,భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వద్యాలయ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్ ఆఫీసర్,చమర్తిరాజు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పటానికి ఈ గుర్తింపు తొలిమెట్టని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఆర్థిక, పరిపాలనా విభాగం వైస్ ప్రెసిడెంట్, కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ.. WASC గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎన్నోబాటలు వేస్తుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియారాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధనను ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమా మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన జరుగుతుంది. మరిన్ని వివరాలు https://www.universityofsiliconandhra.org/ వెబ్ సైట్లో లభిస్తాయని ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు. -
అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం
కాలిఫోర్నియా: ఆమెరికాలోని కాలిఫొర్నియాలో భారతీయ కళలు, భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్లో ఘనంగా జరిగింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందించారు. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా ఆనంద్ కూచిభొట్ల, డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. ఈ స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు అబ్బురపరిచే ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది. -
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి సంపత్
కాలిఫోర్నియా : అమెరికా విచ్చేసిన తమిళనాడు కార్మికశాఖ మంత్రి ఎంసీ సంపత్ సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సంపత్, అతని సిబ్బందికి సిలికానాంధ్ర ఘన స్వాగతం పలికింది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా సిలికానాంధ్ర సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విస్తరిస్తున్న మనబడి, కాలిఫోర్నియా రాష్ట్ర అనుమతి పొంది భారతీయ కళలను బోధిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధిని వివరించారు. అలాగే, కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పించిన కృషిని, చుట్టుపక్కల 150 గ్రామాలకు వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో సంజీవనీ వైద్యాలయ స్థాపనకు దాతలు అందించిన సహాయాన్ని, అమెరికా డాక్టర్లు, ఇతర శ్రేయోభిలాషుల సహకారాన్ని కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అమెరికాలోనే కాకుండా, భారతదేశంలో కూడా సిలికానాంధ్ర చేస్తున్న సేవలను, సాధిస్తున్న ప్రగతిని మంత్రి సంపత్ కొనియాడుతూ, ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయ కళలను, సంస్కృతిని అమెరికా దేశంలో బోధించాలనే సదుద్దేశంతో స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అందుకు కృషిచేస్తున్న సిలికానాంధ్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తెలుగు విభాగాలను ప్రారంభించారన్న విషయం తెలుసుకున్న సంపత్, విశ్వవిద్యాలయంలో తమిళభాషా ఫీఠాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని హామీ ఇస్తూ సిలికానాంధ్రా బృందాన్ని తమిళనాడుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గం, బే ఏరియా తమిళ మన్రం, ఫ్రీమాంట్ ఇస్లామిక్ సెంటర్ ముస్లిం అసోషియేషన్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org ని చూడవచ్చని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. -
సిలికానాంధ్ర వర్సిటీకి కాలిఫోర్నియా అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, తెలుగు కళల విద్యాభ్యాసం, ఈ రంగాల్లో పరిశోధనల ప్రాతిపదికగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వర్సిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. త్వరలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్, డిప్లమో, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. రెండో దశలో తెలుగు భాషా శాస్త్రాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. 2007లో 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, ఈ ఏడాది 6,200 మందికి చేరుకుందని ప్రధాన బోధనాధికారి రాజు చమర్తి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యనందించాలనే లక్ష్యంతో సిలికాన్ వ్యాలీలో ఏర్పాటైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారి దీనబాబు కొండుభట్ల చెప్పారు. వివిధ కోర్సుల్లో చేరేందుకు చాలామంది తెలుగువారు తమను సంప్రదిస్తున్నారని వ్యవస్థాపక సభ్యులు గంటి అజయ్, కొండిపర్తి దిలీప్ పేర్కొన్నారు.