కాలిఫోర్నియా : అమెరికా విచ్చేసిన తమిళనాడు కార్మికశాఖ మంత్రి ఎంసీ సంపత్ సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సంపత్, అతని సిబ్బందికి సిలికానాంధ్ర ఘన స్వాగతం పలికింది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా సిలికానాంధ్ర సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విస్తరిస్తున్న మనబడి, కాలిఫోర్నియా రాష్ట్ర అనుమతి పొంది భారతీయ కళలను బోధిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధిని వివరించారు. అలాగే, కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పించిన కృషిని, చుట్టుపక్కల 150 గ్రామాలకు వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో సంజీవనీ వైద్యాలయ స్థాపనకు దాతలు అందించిన సహాయాన్ని, అమెరికా డాక్టర్లు, ఇతర శ్రేయోభిలాషుల సహకారాన్ని కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
అమెరికాలోనే కాకుండా, భారతదేశంలో కూడా సిలికానాంధ్ర చేస్తున్న సేవలను, సాధిస్తున్న ప్రగతిని మంత్రి సంపత్ కొనియాడుతూ, ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయ కళలను, సంస్కృతిని అమెరికా దేశంలో బోధించాలనే సదుద్దేశంతో స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అందుకు కృషిచేస్తున్న సిలికానాంధ్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తెలుగు విభాగాలను ప్రారంభించారన్న విషయం తెలుసుకున్న సంపత్, విశ్వవిద్యాలయంలో తమిళభాషా ఫీఠాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని హామీ ఇస్తూ సిలికానాంధ్రా బృందాన్ని తమిళనాడుకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గం, బే ఏరియా తమిళ మన్రం, ఫ్రీమాంట్ ఇస్లామిక్ సెంటర్ ముస్లిం అసోషియేషన్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org ని చూడవచ్చని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment