సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC గుర్తింపు | University Of Siliconandhra Gets Wasc Recognition In Usa | Sakshi
Sakshi News home page

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC గుర్తింపు

Published Wed, Jul 14 2021 9:11 PM | Last Updated on Wed, Jul 14 2021 9:19 PM

University Of Siliconandhra Gets Wasc Recognition In Usa - Sakshi

కాలిఫోర్నియా:  భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC(Western Association of Schools and Colleges) గుర్తింపు లభించింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులచే ఇటువంటి విశ్వవిద్యాలయం నెలకొల్పబడటం ప్రథమం. విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు లభించడం ప్రప్రథమం. కాలిఫోర్నియా రాష్ట్రంలో పేరొందిన స్టాన్ ఫోర్డ్,  యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా,  బర్కిలీ, లాస్‌ఎంజిల్స్‌ విశ్వవిద్యాలయాలకు ఉన్న గుర్తింపు ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి లభించింది.


సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయ స్థాయిలో పట్టంగట్టి, ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకమని, ఈ అపూర్వ ఘట్టాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆచార్య పప్పు వేణుగోపాల్రావు మాట్లాడుతూ.. ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం మరిన్ని భారతీయ కళలు,భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.  

విశ్వద్యాలయ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్ ఆఫీసర్,చమర్తిరాజు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పటానికి ఈ గుర్తింపు తొలిమెట్టని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఆర్థిక, పరిపాలనా విభాగం వైస్ ప్రెసిడెంట్, కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ.. WASC గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎన్నోబాటలు వేస్తుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియారాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధనను ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు  సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమా మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన జరుగుతుంది. మరిన్ని వివరాలు https://www.universityofsiliconandhra.org/ వెబ్ సైట్లో లభిస్తాయని ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement