న్యూ జెర్సీ: అమెరికాలో గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం పాటలు మరింత మారుమోగేలా చేసేందుకు అమెరికాలో కళావేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలు స్వరఝరి అనే కొత్త విభాగాన్ని జూన్ 4న ఏర్పాటు చేసింది. బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా న్యూజెర్సీలో ఈ విభాగాన్ని ప్రారంభించింది. బ్రిడ్జ్‌వాటర్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, స్టెర్లీ ఎస్. స్టాన్లీ (న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు), ఉపేంద్ర చివుకుల (కమిషనర్, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్) పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.
వారితో పాటుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఎటిఎ), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా), తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్), తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టిఎల్‌సిఎ) సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి వేద స్వస్తి తో ప్రారంభించారు.
స్థానిక ప్రముఖ గాయకుడు ప్రసాద్ సింహాద్రి ‘శంకరా..! నాద శరీరా పరా’ పాటతో ఎస్పీ బాలుకు ఘన నివాళి అర్పించారు. అనంతరం పలువురు స్థానిక నాయకులు బాలు గారితో తమ అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా బాలూ స్వరఝరి సంస్థ లక్ష్యమని కళా వేదిక అధ్యక్షులు, వ్యవస్థాపకురాలు స్వాతి అట్లూరి తెలిపారు. స్వరఝరి కార్యక్రమం ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ స్వచ్చంద సంస్థ ద్వారా కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న పలువురు సినీ కళాకారులకు తమవంతు సాయం అందచేస్తామని స్వాతి అట్లూరి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సంగీత ప్రముఖ సంగీత దర్శకుకుడు కోటి మాట్లాడుతూ.. ఎస్పీ బాలుతో కలిసి 2 వేలకు పైగా పాటల్లో పనిచేశానని పేర్కొన్నారు. ప్లేబ్యాక్ సింగర్ ఉష ఎస్పీ బాలుకు నివాళులు అర్పించారు. కాగా ఉష స్వరఝరి సంస్థకు కార్యదర్శిగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సంస్థకు ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, హరీష్ శంకర్ గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్, దేవి శ్రీ ప్రసాద్, అనుప్ రూబెన్స్, పలువురు టాలీవుడ్ గాయకులు స్వర ఝరీ బృందానికి తమ శుభాకాంక్షలను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment