అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు 2022 ఫిబ్రవరి 21న వర్చువల్‌గా జరిగాయి. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని వివరిస్తూ.. పర దేశంలో ఉంటూనే మాతృభాషను పరిరక్షించి పరివ్యాప్తం చేయడం లో తానా చేస్తున్న కృషిని అభినందించారు.
తానా తీరు అభినందనీయం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరి బాబు మాట్లాడుతూ మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంటూ కూడా నెల నెలా తెలుగు వెన్నెల పేరిట సాహిత్య సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు 32 వ సమావేశం జరుపుకుంటున్న తానా సంస్థకు అభినందనలు తెలియజేశారు.
మిజోరాంలో తెలుగు ప్రతిభ
గౌరవ అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ అంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి మన మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మరో గౌరవ అతిధిగా పాల్గొన్న మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ మిజోరాం రాష్ట్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకుని ఉన్న, అక్షరాస్యతలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రమన్నారు. అక్కడ చాలా తక్కువమంది తెలుగు వారు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని తెలిపారు.
ప్రముఖులు
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాలనుండి తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో దాట్ల దేవదానం రాజు, పుదుచ్చేరి (యానాం), ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ (తమిళనాడు), యజ్ఞ నారాయణ (కేరళ), విజయభాస్కరరెడ్డి (మహారాష్ట్ర), తుర్లపాటి రాజేశ్వరి (ఒడిశా), లండ రుద్రమూర్తి (ఛత్తీస్ గడ్), రాపోలు బుచ్చిరాములు(గుజరాత్), వింజమూరి బాలమురళి (పశ్చిమ బెంగాల్), ఆచార్య యన్. లక్ష్మి అయ్యర్ (రాజస్తాన్), కమలాకర రాజేశ్వరి ( న్యూ ఢిల్లీ)లు ఉన్నారు.
ఇది నేపథ్యం
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 2 1 వ తేదిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణాలను వివరించారు... అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్ లో అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ భాషను జాతీయ భాష గా బలవంతంగా రుద్దినప్పుడు అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేస్తూ సాగించిన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952 లో ఎంతో మంది మరణించగా, కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ విషాదకర సంఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుండి ఏటాఫిబ్రవరి 21 ని అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది అని తెలిపారు.
సంతాపం
గుండెపోటుతో మృతిచెందిన ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నాగళ్ల గురుప్రసాద రావుల మృతికి తానా సంతాపం తెలిపింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర వారికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment