పెళ్లిళ్ల విషయాల్లో మనకూ వాళ్లకున్న స్పష్టమైన తేడా , మనవి చాలావరకు పెద్దలు నిశ్చయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ కాగా వాళ్ళవి ప్రేమ వివాహాలు. అమెరికన్ల వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడమంటే ఒక తేనె తెట్టెను కదిల్చినట్లే. వివాహం ఒక జీవితకాల బంధంగా భావించేవారు ఆ దేశంలో దినదినం తగ్గిపోతున్నారు. పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం రెండూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడంతో అసలు పెళ్లెందుకు ? అని ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు .
పెళ్ళైనా కాకున్నా తప్పవు చికాకులు
అందుకే పెళ్ళి.. బెటర్ విందువినోదాలు
బెల్లమైనా పెళ్ళామైనా కొత్తలో చాలాతీపి
పాతబెల్లం మందులకు.. పెళ్ళాం పిల్లలకు
నచ్చినవాడే కాదు మెచ్చినవాడు కూడా
ఎప్పుడు దొరికితే అప్పుడే కళ్యాణం
కలిసివుండడం గుడ్.. కుదరనప్పుడు
నిత్యకలహాలకన్నా విడిపోవడం వెరీగుడ్
ఇందులో మొదటి రెండు భారతీయుల మనస్తత్వాన్ని , చివరి రెండు అమెరికా వాళ్ళ ఆలోచనా ధోరణిని తెలిపే కవితలు. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే యువతీ యువకులు , సేమ్ సెక్స్ ( స్వలింగులు ) జంటలు ఆ దేశంలో పెరిగిపోతున్నాయి. వీళ్లను అదుపు చేయగలగిన కుటుంబ పెద్దల వ్యవస్థ అక్కడ బలహీనమై పోయింది. పేరెంట్స్ డే నాడు కలుసుకోడానికి వచ్చినప్పుడే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో పెద్దలకు తెలిసే పరిస్థితులు. మన దేశంలో పొద్దున్నుండి రాత్రి వరకు స్త్రీ చేసిన ఇంటి వంట పనులు, పిల్లల పోషణ లెక్కలోకి రావడం లేదు.
కులాలు, మతాలు ప్రాతిపదికనళ్లు పెళ్లిళ్లే ఉండవు..
ఆమె భర్త చాటు అబల మాత్రమే, సమవుజ్జి కాలేని పరిస్థితులు ఇప్పటికీ నెలకొనివున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. బయటకు వెళ్లి మగవాడు చేసిందే సంపాదన , ఆయనే కుటుంబ యజమాని. అమెరికాలో పరిస్థితి భిన్నం. మహిళ సబల, భర్త వెనక నడిచే భార్య కాదు. ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ షాపింగ్, జిమ్, బ్యూటీ పార్లర్, సినిమా షికార్లకు వెళ్లి రాగలదు.
అక్కడ భార్యభర్తలు ఇద్దరూ ఏదో ఓ ఉద్యోగం చేసేవారే. తండ్రి మాత్రమే బ్రెడ్ విన్నర్, తల్లి గృహ సంరక్షకురాలు మాత్రమే అనడానికి లేదు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసివున్నా ఎవరి సంపాదన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికెవరు భయపడాల్సిన పనిలేదు.తేడాలు వస్తే , కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల పెంపక బాధ్యతలు పంచుకుంటున్నారు.
- అమెరికాలో కులాలు, మతాల ప్రాతిపదికన పెళ్లిళ్లు ఉండవు
- ఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఎంచుకోవచ్చు
- పెళ్లికి ముందే తప్పనిసరిగా పరిచయం అయి ఉంటుంది
- ఒకరి గురించి మరొకరికి సంపూర్ణంగా అవగాహన కలిగే వారకు కలిసి ఉంటారు
- ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటై.. కలిసి ఉంటామన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటారు
- అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెళ్లికి సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పద్ధతులున్నాయి
- వయస్సులో భర్త పెద్దగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, ఇష్టం ఉంటే చాలు
- అమెరికాలో పెళ్లిళ్లకు ముందే చాలా మంది కౌన్సిలర్లను కలుస్తారు. భాగస్వామితో కలిసి ఒకరి గురించి మరొకరు చర్చిస్తారు. బంధం ధృడమయ్యేందుకు చర్చలు జరుపుతారు
- ఆడ-మగ అనే కాదు, స్వలింగ వివాహాలు కూడా ఇక్కడ చట్టబద్ధమే
- పెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. చట్ట ప్రకారం ఇద్దరికి అన్ని హక్కులు సమానంగా ఉంటాయి
- భారతదేశంతో పోలిస్తే విడాకులు ఇక్కడ సర్వసాధారణం
- విడాకుల విషయంలో కోర్టులు విధించే భారీ పరిహారమే భయపెట్టేలా ఉంటుంది
- భారత్‌లో జరిగినట్టుగా పెళ్లిళ్లు భారీ హడావిడితో జరగవు.
- డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా జరుగుతాయి. మంచి పర్యాటక ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవడమంటే అమెరికన్లకు ఇష్టం
- పెళ్లి ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. వర్చువల్‌గా విషెస్ చెబుతారు.
- చాలా వరకు పెళ్లిల్లు వీకెండ్‌లోనే జరుగుతాయి.
- మన దగ్గర పెళ్లి చీరకు ఎంత విలువ ఉంటుందో.. అక్కడ వెడ్డింగ్ గౌన్‌కు అంత ప్రాధాన్యత.
భారత్ నుంచి వెళ్లి సెటిలయ్యే వారిలో కొందరు అమెరికన్లను పెళ్లి చేసుకున్నవారున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వెనక కూడా లీగల్ పాయింట్లు లాగే వారున్నారు. పౌరసత్వం కోసం కొందరు పెళ్లికి ఆరాట పడ్డా.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినమయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చే వాళ్లను కఠిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడ పరిచయం, ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు? పెళ్లికి ఇద్దరికి ఎప్పుడు ఒప్పందం కుదిరింది? ఇలాంటి ప్రశ్నలతో పాటు ఆధారాలు చూపించమంటున్నారు.
పెరుగుతున్న విడాకులతో పాటు సహజంగానే పునర్వివాహాలు కూడా ఎక్కువవుతున్నాయి. అమెరికాలో సగానికి పైగా కుటుంబాలు పునర్వివాహాలు చేసుకున్నవారే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆమె పిల్లలు, ఆయన పిల్లలు, వారి పిల్లలు ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోతున్న విడాకుల ప్రభావం పిల్లల మానసిక స్థితి పై పడుతుంది వాస్తవం. వీటికి తోడు పెళ్లికాని టీనేజ్ పిల్లలు గర్భం దాల్చడం, అసలు పెళ్లే చేసుకోకుండా కలిసివున్నవారు కన్న పిల్లలు ఇప్పుడు అమెరికా సమాజానికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు . నల్ల జాతీయుల్లోనైతే వివాహేతర జననాలు 25 శాతం వరకు ఉంటాయంటున్నారు !.
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment