యథేచ్ఛగా పోలవరం కట్ట నుంచి మట్టిని తరలిస్తున్న దృశ్యం(ఫైల్)
సెలవు రోజు వచ్చిందా...మట్టి మాఫియాకు పండగే...చీకటి వ్యాపారానికి తెర లేస్తుంది. మట్టి మాఫియా చెలరేగిపోతుంది. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతాయి. గత టీడీపీ ప్రభుత్వంలో దోపిడీ చేసిన వారే ఇప్పటికీ అనధికారిక తవ్వకాలు సాగిస్తున్నారు. నాడు వీరిచ్చిన మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఇప్పటికీ వీరికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. పోలవరం కాలువ 147 నుంచి 150 చైనేజి కుడిపక్కన గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని అక్రమంగా తరలించినట్లు సమాచారం. సూరంపల్లికి చెందిన టీడీపీ నేత కనుసన్నల్లోనే ఈ తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ తవ్వకాలపై నున్న, పాతపాడు, సూరంపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. అక్రమంగా తరలించిన దాదాపు 4 వేలకు పైగా ట్రిప్పుల మట్టిని ఫ్లిప్‌కార్ట్ వారికి చెందిన స్థలంతో పాటు, ముస్తాబాద వద్ద ఉన్న పొలాలను మెరక చేసేందుకు వినియోగించినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా ఈ మట్టి మాఫియా వేలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలించి, కోట్లాది రూపాయలను దండుకుంది.
అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నారిలా...
ప్రధానంగా సెలవు రోజుల్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న టీడీపీ నేతకు అక్కడ పనిచేసే ఏఈ స్థాయి అధికారి బంధువు కావడంతో, ఆ అధికారి ద్వారా చక్రం తిప్పుతున్నారు. నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన డీఈఈ, ఈఈ స్థాయి అధికారులతో ఆ టీడీపీ నేత బలమైన మైత్రీ బంధం ఉండడంతో తన బంధువు అయిన ఏఈకి ఏ ఇబ్బందీ రాకుండా చక్క బెడుతున్నారు.
అనుమతులు లేవు
పోలవరం కాలువ మట్టికి సంబంధించి ఒకరికి తప్ప, మరెవరికీ మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలపై నిఘా ఏర్పాటు చేశాం.
– కర్ణ శ్రీనివాసరావు,పోలవరం డివిజన్ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment