శ్రీనివాసరావు, వెంకటేశ్వరమ్మ (ఫైల్)
రామవరప్పాడు(గన్నవరం): పట్టాలు దాటుతున్న దంపతులను వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విజయవాడ సమీపంలోని రామవరప్పాడు రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి జరిగింది. గుణదల కుమ్మరి బజారులో సుంకర శ్రీనివాసరావు (43), వెంకటేశ్వరమ్మ (42) దంపతులు నివసిస్తున్నారు. వారికి 17 ఏళ్ల క్రితం వివాహమైంది.
ఇద్దరు కుమారులు సంతానం. శ్రీనివాసరావు ఓ ప్రైవేటు కాలేజీలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వరమ్మ సోదరుడు చెరుకుమల్లి వేణు భార్య కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో పరామర్శించేందుకు మంగళవారం గుడివాడ సమీపంలోని ఇందుపల్లికి వెళ్లింది. పరామర్శించి సాయంత్రం నర్సాపూర్ – గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లో వెంకటేశ్వరమ్మ విజయవాడకు బయలుదేరింది. భర్త శ్రీనివాసరావుకు ఫోన్ చేసి రామవరప్పాడు రైల్వేస్టేషన్‌కు రావాలని కోరింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో ట్రైన్ దిగి రామవరప్పాడు స్టేషన్ మూడో నంబరు ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది.
శ్రీనివాసరావు ఆ ప్లాట్‌ఫాంపైకి వెళ్లి భార్యతో కలిసి లగేజీ తీసుకుని స్టేషన్‌లోని పట్టాలు దాటి ఒకటో నంబరు ప్లాట్‌ఫాంనకు వెళ్లే క్రమంలో కొట్టాయం ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. తోటి ప్రయాణికులు వారిని అప్రమత్తం చేసేందుకు కేకలు వేశారు. అయితే శ్రీనివాసరావు, వెంకటేశ్వరమ్మ కంగారులో పట్టాలు దాటలేకపోయారు. ఇంతలో ట్రైన్ వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment